మొయినాబాద్, సెప్టెంబర్ 6 : ప్రభుత్వం రైతులకు యూరియాను అరకొరగా పంపిణీ చేస్తుండడంతో వారికి కష్టాలు తప్పడం లేదు. మండలంలో శనివారం ఉదయం 9 గంటలకు యూరియా పంపిణీ చేస్తామని వ్యవసాయ, పీఏసీఎస్ అధికారులు చెప్పడంతో రైతులు తిండి తిప్పలు మాని.. తెల్లవారుజాము నుంచే మొయినాబాద్ రైతువేదిక వద్దకు చేరుకుని క్యూలో అధిక సంఖ్య లో నిరీక్షించారు. లైన్లో ఉండి.. ఉండి అలసిపోయిన రైతులు నిల్చోలేని స్థితిలో అక్కడ చెప్పులను పెట్టారు.
అధికారులు వచ్చి టోకె న్లు ఇవ్వగా వాటిని తీసుకునేందుకు అధిక సంఖ్యలో బారులుతీరారు. టోకెన్లు తీసుకు ని మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం వద్దకు చేరుకున్న రైతులకు అధికారులు అరకొరగా యూరియాను పంపిణీ చేయడంతో చాలామంది రైతులు అసహనం వ్యక్తం చేశారు. టోకెన్లు తీసుకున్న 50 మంది రైతులకు యూరియా అందకపోవడంతో వారు నిరాశతో ఇండ్లకు వెళ్లిపోయా రు. మంగళవారం యూరియా వస్తుందని.. రాగానే మీకే ముందుగా ఇస్తామని అధికారులు చెప్పారు. పోలీసు పహారాలో రైతులకు యూరియాను పంపిణీ చేశారు.