పంట మారుద్దాం దిగుబడి పెంచుదాం
రైతులు వేసిన పంటలే మళ్లీ వేయడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. చాలా మంది నేటికీ ఒకే రకమైన పంటలను పండిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏటేటా పంట మార్పిడి చేస్తే దిగుబడులు పెరగడంతోపాటు నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూసారం వృద్ధి చెందుతుంది. చీడపీడల బెడద తగ్గుతుంది.
- చీడపీడల కట్టడికి మార్గం
- భూసారం వృద్ధి చెందే అవకాశం
- పెరుగనున్న ఉత్పత్తుల నాణ్యత
- పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు
రైతులు వేసిన పంటలే మళ్లీ వేయడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. చాలా మంది నేటికీ ఒకే రకమైన పంటలను పండిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏటేటా పంట మార్పిడి చేస్తే దిగుబడులు పెరగడంతోపాటు నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూసారం వృద్ధి చెందుతుంది. చీడపీడల బెడద తగ్గుతుంది. ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే పురుగుల మందు ఖర్చు తగ్గుతుంది. పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ధర పొందే అవకాశం ఉన్నది. పంట మార్పిడితో కలిగే ప్రయోజనాలపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ

వ్యవసాయ రంగంలో పంట మార్పిడి విధానంతో పురుగుల ఉధృతి తగ్గడమే కాకుండా భూసార సంరక్షణ, పోషక లోపాల నివారణ జరిగి రైతులు అధిక దిగుబడులు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాలా మంది రైతులు దీన్ని పాటించకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రతి ఏటా పంట మార్పిడి విధానాన్ని అవలంబించినట్లయితే నాణ్యమైన ఉత్పత్తులు వచ్చి దిగుబడులు రెట్టింపయ్యే వీలు ఉంటుంది. భూమిలోని పోషకాలు సమృద్ధ్దిగా అందుతాయి. ఈ విషయాలన్నింటినీ వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పుడూ ఒకే పంటను పండించడంతో పురుగులకు నిరంతరం ఆహారం లభ్యమై వాటి జీవిత చక్రం పునరావృతం అవుతూ వాటి సంతతి పెరుగుతుంది. దీంతో పంటలకు చీడ, పీడల బెడద ఎక్కువవుతున్నది. ఒకే పంట పండించడంతో ఆ పంట వేర్లు నేలలో వ్యాపించి పోషకాలను గ్రహించడంతో కొన్ని రోజులకు ఆ మట్టి పొరలు విస్తారం అవుతాయి. అలాంటి నేలల్లో వేసే పంటల దిగుబడులు తగ్గిపోనున్నాయి. వివిధ వేరు వ్యవస్థ కలిగిన పత్తి, కంది, వంటి పంటలు, మామూలు వేరు వ్యవస్థ గల(స్వల్ప, లోతుకు చొచ్చుకుపోయే) వరి, వేరుశనగ వంటి పంటలతో మార్పిడి చేయాలి. నీటి వసతి సరిగా లేని ప్రాంతంలో ఒక పంటను పూర్తి నీటి వసతితో పండించి 2వ పంటను వర్షాధారంగా వేసుకుంటే నీటి వినియోగం సమర్థవంతంగా జరుగుతుంది. మిరప, టమాట, వేరుశనగ పంటలను ఆశించే లద్దె పురుగు నివారణకు జొన్న, వరి, సజ్జ, రాగి పంటలతో మార్పిడి చేసుకోవాలి. పంట మార్పిడి చేయడంతో పొలంలో పురుగులు, ప్రాణాంతక తెగుళ్లు వృద్ధి చెందడానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. పంట మార్పిడి చేయడంతో నేలలోని మట్టి సారవంతమవడంతో పాటు మట్టి ఉత్పాదకత స్థిరంగా కాపాడుకోవచ్చు.

పంట మార్పిడి విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- వరిని ఆశించే కాండం తొలుచు పురుగు, ఆకు మచ్చ తెగులు నివారణకు అపరాలతో పంట మార్పిడి చేసుకోవాలి. దీంతో పురుగుల ఉధృతి తగ్గడమే కాకుండా నత్రజని స్థిరీకరించబడి తర్వాత వేసే పంటకు పనికి వస్తుంది.
- నులి పురుగుల బెడద ఉన్నప్పుడు నువ్వు, బంతి, ఆవాలతో పంట మార్పిడి చేస్తే వాటి ఉధృతి తగ్గుతుంది.
- జొన్నలో కాండం తొలుచు పురుగు నివారణకు పొద్దుతిరుగుడు, వేరుశనగలతో పంట మార్పిడి చేసుకోవాలి.
- టమాటాలో వడ తెగుళ్లు, లద్దె పురుగుల నివారణకు పెసర, జొన్న, వరి, సజ్జ పంటలను వేసుకోవాలి.
- పత్తిలో గులాబీ రంగు కాయ తొలుచు పురుగు, లద్దె పురుగు వంటి వాటి నివారణకు అపరాలు, జొన్న, మక్కజొన్నలో ఎర్ర కుళ్లు, వడలు, తెగులు నివారణకు జొన్నతో పంట మార్పిడి చేయాలి.
- పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటలను ఎంపిక చేసుకోవాలి.
- శనగ, బొబ్బర, పెసర, మినుము పంటలను వేసుకోవడంతో నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి. దీంతో కలుపు మొక్కలను నివారించుకోవచ్చు.

పంటల మార్పిడితో ప్రయోజనాలివే..
- నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది.
- భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి చెందుతుంది.
- చీడ, పీడలు, క్రిమికీటకాలు పంటలకు దూరమవుతాయి.
- సస్యరక్షణకు వినియోగించే పురుగు మందుల ఖర్చు తగ్గుతుంది.
- పంటలకు శిలీంధ్ర వ్యాధులను దూరం చేయవచ్చు.
- పంటలకు బీజాలు వంటి అవశేషాలు, వానపాముల అభివృద్ధి కూడా ఎక్కువవుతుంది.
- కీటకాల గుడ్లు వృద్ధి చెందే అవకాశాలు తగ్గుతాయి.
- పంటలో నాణ్యత పెరిగి దిగుబడి ఎక్కువగా పొందే అవకాశాలు ఉన్నాయి.
- ఈ విధానంలో చేయనివి..
- జొన్న పంట సాగు చేసిన పొలంలో మిరపను వేయవద్దు.
- వేరుశనగను మళ్లీ సాగు చేస్తే ఎర్ర గొంగళి పురుగు, శనగపచ్చ పురుగులు ఆశిస్తాయి.
- నులి పురుగు ఉన్న ప్రాంతాల్లో వంగ, బెండ, టమాట, ఉలువలు, మినుములు, పెసర పంటలు వేస్తే అవి వాటిని మరింత
వృద్ధి చేస్తాయి. అందువల్ల ఆ పంటలను సాగు చేయవద్దు.

Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- Crops
- farmers
- financially
- growing
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

