కొడంగల్, డిసెంబర్ 13 ; ‘భూములు ఇవ్వబోమన్నందుకు కాంగ్రెస్ సర్కార్ గోస పెడుతున్నది.. మా కన్నీటి బాధ తీరేదెప్పుడు.. మా వాళ్లకు ఏమైనా అయితే మాకు దిక్కెవరూ..! అందుకు బాధ్యత ఎవరు తీసుకుంటరు.. మా బతుకులు ఏం కావాలె.. మమ్మల్ని సాకేదెవరు.. అరెస్టు అయిన నాటి నుంచి నెల రోజులుగా కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నం.. తిండి తినబుద్ధి అయితలేదు.. కంటికి నిద్ర లేదు.. పిల్లలు ఏడుస్తున్నరు.. మా నాన్న ఎక్కడని అడిగితే కడుపు తరుక్కుపోతున్నది.. అరస్టైన వారిలో చాలా మంది జబ్బులున్నొళ్లే.. గుండె నొప్పి వస్తే బేడీలు వేసి దవాఖానకు తీసుకెళ్తరా.. ఇదేనా ప్రజాపాలనా.. ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్‌కు మనసు కరుగుతలేదు..’ అని లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాల సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
భూములను కాపాడుకునేందుకు న్యాయ పోరాటం చేసి అరెస్టు అయిన రైతు కుటుంబాలు నిత్యం ఆవేదనతో కుమిలిపోతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా శుక్రవారం దుద్యాల మండలం కోస్గి-తుంకిమెట్ల రోడ్డులోని లగచర్ల గేటు వద్ద బాధిత రైతు కుటుంబాల సభ్యులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా భూములను కాపాడుకునేందుకే న్యాయ పోరాటం చేశామని, రాష్ట్ర ప్రభుత్వం ఇంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సమంజసం కాదన్నారు. లగచర్ల ఘటన జరిగిన నాటి నుంచి గ్రామాల్లో మగవాళ్లు లేక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామన్నారు. నెల రోజులుగా మా వాళ్లు ఎప్పుడొస్తారా.. అని ఎదురుచూస్తున్నామన్నారు. అరెస్టు అయిన వారిలో చాలా మందికి ఆరోగ్యాలు బాగాలేవని, కొంత మందికి జైలుకు వెళ్లిన తరువాతే బీపీ, షుగర్, గుండె జబ్బులు వచ్చాయని.. ఎలా ఉన్నారో అర్థం కావడం లేదని కన్నీరు పెట్టారు.
సీఎం సొంత నియోజకవర్గంలో ప్రజలు బాధలు పడుతున్నా.. రేవంత్‌రెడ్డికి మనసు కరుగడం లేదని, ప్రజలపై ఇంత ద్వేషమెందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్.. సీఎం కావాలని ఓట్లు వేస్తే.. ఇప్పుడు బూట్లతో తన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్… సీఎం అయితే బతుకులు మారుతయనుకున్నం.. కానీ రోడ్డుపాలవుతమని అనుకోలేదని వారు వాపోయారు. పులిచర్లకుంట తండాకు చెందిన హీర్యానాయక్.. అరెస్టుకు ముందు ఆరోగ్యంగా ఉన్నారని, ఇప్పుడు గుండెజబ్బు రావడం బాధగా ఉన్నదని, చేతికి బేడీలు వేసి రోడ్డుపై నడిపించుకుంటూ దవాఖానకు ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. కొడుకును చూద్దామని వెళ్లిన ఓ కన్నతల్లిని అనుమతించకపోవడం దుర్మార్గ పాలనకు నిదర్శనమన్నారు. అరెస్టు అయిన వారికి ఏం జరిగినా సీఎం రేవంత్‌దే బాధ్యత అని.. తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గ్రామాల్లో మగవాళ్లు లేక పండించిన పంట, పొలాల్లోనే మగ్గుతున్నదని వాపోయారు. ఘటనకు ముందు మేమున్నామని భరోసా ఇచ్చిన వారు సైతం మళ్లీ కనిపించడంలేదని ఆవేదన వెలుబుచ్చారు.
ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు లగచర్ల గేటు వద్దకు చేరుకుని బాధిత రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మరో వారం రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని, అంత వరకు శాంతియుతంగా ఉండాని సర్దిచెప్పడంతో బాధితులు ధర్నాను విరమించారు.
నా కొడుకు పిచ్చోడై తిరుగుతుండు..
నా భర్త నీరటి హన్మంతు జైలుకు వెళ్లిన నాటి నుంచి నా కొడుకు పిచ్చోడై తిరుగుతుండు.. పరీక్షలు చేయించి మందులు వేస్తున్నా. నా కొడుకును దవాఖానకు తీసుకెళ్తే.. అక్కడా బాధ పెడుతుండ్రు. నా భర్తకు ఆరోగ్యం బాగాలేక పది నెలల క్రితం ఆపరేషన్ కూడా అయ్యింది. ఆయనకు కిడ్నీలో రాళ్లు ఉన్నయని డాక్టర్లు చెప్పిండ్రు. ఎట్లున్నడో.. ఎప్పుడొస్తడో తెల్వక రోజూ ఏడుస్తూ కాలం గడుపుతున్నం.
– వెంకటమ్మ, లగచర్ల, దుద్యాల మండలం
నా భర్తకు ఆపరేషన్ చేయించా..
నా భర్త గోపాల్‌కు ఎదలో గడ్డ ఉంటే ఏడాది కింద ఆపరేషన్ చేయించినా. అప్పటి నుంచి రెండు, మూడు నెలలకోసారి దవాఖానకు వెళ్లి చూపించుకునేది. ఇప్పుడు జైల్లో ఉన్నడు. వాళ్లు పట్టించుకుంటుండ్రో.. లేదో.. బెంగగా ఉన్నది. నా భర్తకు ఏమైనా అయితే కుటుంబమంతా దిక్కులేనోళ్లమవుతం. ఇప్పటికైనా సర్కార్ దయతలచి వదిలిపెట్టాలి.
– మంజుల, లగచర్ల, దుద్యాల మండలం
జైలుకు వెళ్లాకే బీపీ, షుగర్ వచ్చింది..
జైలుకు వెళ్లాకే మా ఆయనకు బీపీ, షుగర్ వచ్చింది. మందులు వాడుతున్నడో.. లేదో తెల్వదు.. అంతకు ముందు ఆరోగ్యంగా ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ గోస పెడుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కోసే వాళ్లు లేరు.. ఇంటికి చేర్చేవాళ్లు లేరు.. మా బాధను ఏ దేవుడికి చెప్పుకోవాలె. రేవంత్‌రెడ్డిని గెలిపించి రోడ్డున పడ్డాం.
– సుమిత్రాబాయి, రోటిబండతండా, దుద్యాల మండలం