పంట రుణాలు మాఫీ కాని అన్నదాతలు తీవ్ర మదనపడుతున్నారు. అన్ని అర్హతలున్నా.. మాకు ఎందుకు మాఫీ వర్తించలేదని వ్యవసాయాధికారులను ప్రశ్నిస్తున్నారు. మండలంలోని నస్కల్ గ్రామంలో సుమారు వెయ్యి మందికి పైగానే రైతులుండగా.. ఆ ఊరిలో 45 శాతం మందికే రుణమాఫీ వర్తించింది. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని సక్రమంగా రెన్యువల్ చేస్తున్నామని.. రేషన్ కార్డు ఉన్నా మావి ఎందుకు మాఫీ కాలేదని మిగిలిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిగి, ఆగస్టు 28 : పంట రుణాలు మాఫీ అవుతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న అన్నదాతల ఆశలు అడియాసలయ్యాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ పథకం రైతులకు అందని ద్రాక్షలా మారింది. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ. రెండు లక్షల్లోపు పంట రుణాలను ఎలాంటి షరతుల్లేకుండా మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి రాగానే మాట తప్పాడు. అనేక కొర్రీలు, నిబంధనల పేరుతో అన్నదాతలను ఆగం చేస్తున్నా డు.
డిసెంబర్ 9వ తేదీ పోయి 8 నెలలు దాటినా ఇప్పటికీ రుణమాఫీ పూర్తిస్థాయిలో జరుగలేదు. ఆగస్టు 15లోపు మూడు విడతలుగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. అన్ని అర్హతలున్నా తమ రుణాలను ఎందుకు మాఫీ చేయలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకమీదటైనా తమ రుణాలు మాఫీ అవుతాయో లేదోనని మదనపడుతున్నారు. అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత అనేక కొర్రీలు పెడుతూ రుణమాఫీని సాగదీయడం సరికాదని పేర్కొంటున్నారు. ఇదేనా ప్రజాపాలన అని పలువురు మండిపడుతున్నారు.
మండలంలోని నస్కల్ గ్రామంలో సుమారు వెయ్యి మందికి పైగా అన్నదాతలున్నారు. వారిలో అత్యధికంగా వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. కొన్నేండ్లుగా కొత్తిమీర సాగుకు ఈ గ్రామం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఇక్కడ సాగు చేసిన కొత్తిమీరను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. కాగా రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం పరిగి పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్‌లో పంట రుణాలు పొందారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీతో రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని రైతాంగం ఆశిం చింది. కానీ నస్కల్ గ్రామానికి చెందిన రైతులకు మొదటి విడతలో 229 మందికి , రెండోవిడతలో 176 మందికి రుణమాఫీ జరిగింది. ఆగస్టు 15న ప్రకటించిన మూ డోవిడతలో బ్యాంకుల వారీగా రైతుల వివరాలను ఇవ్వడంతో ఎంతమంది రైతులకు మాఫీ జరిగిందన్న విషయాన్ని వ్యవసాయాధికారులు సైతం చెప్పలేకపోతున్నారు. మూడు విడతల్లో గ్రామంలో కలిపి 45శాతం వరకే రుణమాఫీ జరిగింది. రుణమాఫీ కాని బాధితులు రేషన్‌కార్డుతోపాటు అన్ని అర్హతలున్నా తమ రుణాలు మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో రుణాలు తీసుకుని సక్రమంగా రెన్యువల్ చేస్తున్నా రుణమాఫీ ఎందుకు వర్తించలేదని అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ఫ్యామిలీ ్రగ్రూపింగ్ సర్వేతోనైనా మాఫీ జరిగేనా..
రుణమాఫీ జరుగని రైతులకు, రేషన్ కార్డుల్లేని వారి కుటుంబ సర్వేను వ్యవసాయాధికారులు చేపట్టారు. బుధవారం నస్కల్ గ్రామంలోని రైతువేదికలో ఫ్యామిలీ గ్రూ పింగ్ సర్వే నిర్వహించారు. ఇందులో రుణమాఫీ జరుగని, రేషన్‌కార్డు లేని రైతుల వివరాలను రుణమాఫీ యాప్‌లో అప్లోడ్ చేయడంతోపాటు వ్యవసాయాధికారి స్వయంగా సంబంధిత రుణమాఫీ జరుగని రైతు కుటుంబంతో సెల్ఫీ తీసుకొని ఫొ టోను సైతం ఆ యాప్‌లో అప్లోడ్ చేశారు. ఫ్యామిలీ గ్రూపింగ్ సర్వేతోనైనా తమకు రుణమాఫీ జరుగుతుందా..? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రుణమాఫీ జరుగకపోవడానికి పలు కారణాలున్నాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. రైతులకు సంబంధించిన ఆధార్‌కార్డులో ఒకలా, బ్యాంకు ఖాతాలో పేరు మరొలా ఉండడం, ఒక ఆధార్‌కార్డు అనేక బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసి ఉండడం వంటి కారణాలతో రుణమాఫీ కాలేదని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. ఎనిమిదేండ్లపాటు బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు డబ్బులు సంబంధిత ఖాతాల్లో జమ కాగా.. నేటి ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా కొత్త సాకులు చెబుతున్నదని రైతులు వాపోయారు. కొర్రీలన్నీ పక్కన పెట్టి బేషరతుగా రైతులందరికీ రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అర్హత ఉన్నా మాఫీ కాలేదు..
రేషన్ కార్డు ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదు. కేసీఆర్ హయాంలో రూ. లక్ష వరకు రుణమాఫీ జరిగింది. నా పేరిట 7 ఎకరాల భూమి ఉండగా పరిగిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్‌లో రూ.1.50 లక్షల రుణం తీసుకున్నా. ప్రభుత్వం మూడు విడతల్లో రుణమాఫీ చేసినా నాకు మాత్రం వర్తించలేదు. వ్యవసా యాధికారులను అడిగితే ఈ నెలాఖరు వరకు కావొచ్చని చెబుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ ప్రభుత్వం ఎలాంటి షరతుల్లేకుండా రూ.2లక్షల వరకు రుణాలను మాఫీ చేయాలి.
-గొల్ల మల్లయ్య, నస్కల్, పరిగి మండలం
అందరి రుణాలను మాఫీ చేయాలి
నాకు 4.20 ఎకరాల భూమి ఉంది. పరిగిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్‌లో రూ.2 లక్షల క్రాప్ లోన్ తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి రాగానే ఆ రుణాలు మాఫీ అవుతాయని తెలిసి చాలా సంతోషించా. అయితే ప్రభుత్వం మూడు విడతలుగా మాఫీ చేసినా.. నా రుణాలు మాత్రం మాఫీ కాలేదు. రేషన్‌కార్డు కూడా ఉన్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరి రుణాలను మాఫీ చేయాలి.
– వడ్ల బక్కన్న, నస్కల్, పరిగి