రంగారెడ్డి, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఏడున్నర కిలోమీటర్ల పొడవు.. మూడువందల మీటర్ల వెడల్పు ఉన్న తుర్కయాంజాల్ మాసబ్‌చెరువు అలుగు కాల్వ ఎక్కడికక్కడ కుంచించుకుపోయి ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ చెరువు అలుగు అధికంగా పారుతుండడంతో.. దానికి ఇరువైపులా ఉన్న కాలనీలకు ప్రమాదం పొంచి ఉన్నది. ముఖ్యంగా అలుగు కింద ఇంజాపూర్ సమీపంలో ఉన్న ఆపిల్ ఎవెన్యూ కాలనీ మరింత ప్రమాదకర స్థితిలోకి వెళ్లింది. కొంతమంది స్థానిక నాయకులు గతంలో ఆపిల్ ఎవెన్యూ కాలనీని ఫేజ్-1, ఫేజ్-2 వెంచర్లుగా మార్చారు. ఈ వెంచర్ల మధ్యే మాసబ్‌చెరువు నాలా ఉండగా దానిని మూసేసిన రియల్టర్లు రెండు కాలనీల మధ్య యాభై మీటర్ల వెడల్పుతో రోడ్డును వేశారు. వరుసగా కురుస్తున్న వానలతో మాసబ్‌చెరువు నిండి పెద్ద ఎత్తున అలుగు పారుతున్నది. వరద ఉధృతితో ఈ నాలాపై వేసిన రోడ్డు కుంగి, కొట్టుకుపోతున్నది. దీంతో వర్షపు నీరంతా కాలనీలోని ఇండ్లలోకి చేరుతున్నది. దీంతో ఆపిల్ ఎవెన్యూ కాలనీలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక కాలనీలవాసులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. కురుస్తున్న వానలతో ఇండ్లలోకి వస్తున్నది.
తుర్కయాంజాల్ మాసబ్ చెరువు నుంచి వచ్చే అలుగు కాల్వ ఇంజాపూర్, మునుగనూరు, తొర్రూరు తదితర గ్రామాల మీదుగా ఏడున్నర కిలోమీటర్ల పొడవు ఉన్నది. ఈ కాల్వ ఇరిగేషన్ రికార్డుల ప్రకారం మూడు వందల మీటర్ల వెడల్పుతో ఉండాల్సి ఉండగా.. కొందరు రియల్టర్లు ఇంజాపూర్ సమీపంలోని ఆపిల్ ఎవెన్యూ కాలనీ, మునుగనూరు, తొర్రూరు, పెద్దఅంబర్‌పేట తదితర గ్రామాల మధ్య ఈ నాలా స్థలాన్ని ఆక్రమించి వెంచర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ నాలా వెడల్పు 50 నుంచి 100 మీటర్లు కూడా లేదు. దీంతో అలుగు నుంచి వచ్చే వరద ఉధృతి నాలా ఆక్రమణలతో ఇరువైపులా ఉన్న కాలనీల్లోని ఇండ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా నాలాను ఆక్రమించి పలువురు అపార్ట్మెంట్లు, షెడ్లు, ఇండ్ల నిర్మాణం చేపట్టడంతో వరదనీరు బయటికి వెళ్లలేక ఎక్కడికక్కడే నిలిచిపోతున్నది. ఈ పరిస్థితుల్లో పలు కాలనీలు, ఇండ్లు నీట మునిగే ప్రమాదమున్నది.
490 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తుర్కయాంజాల్ మాసబ్‌చెరువు చాలా వరకు కబ్జాకు గురైంది. చెరువు ఎగువ భాగంలో ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరంతా అలుగు ద్వారా కిందకు వెళ్తున్నది. అలుగు నుంచి వచ్చే వరద ఉధృతి పెరిగితే చెరువు కిందనే ఉన్న ఆపిల్ ఎవెన్యూ కాలనీకి తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నది. తుర్కయాంజాల్‌కు చెందిన కొందరు రాజకీయ నాయకులు ఆపిల్ ఎవెన్యూ కాలనీని రెండు ఫేజ్‌లుగా విభజించారు. ఫేజ్-1 నాలాకు ఒకవైపు, ఫేజ్-2 నాలాకు మరోవైపు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ రెండు కాలనీల మధ్య నాలాపై అక్రమంగా సీసీ రోడ్డును వేశారు. ఆ రోడ్డు 30 నుంచి 40 మీటర్ల వెడల్పుతోనే ఉండటంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఉధృతికి ఈ రోడ్డు ఏమాత్రం తట్టుకోలేక.. గుంతలు పడి కొట్టుకుపోతున్నది. తద్వారా ఈ రెండు కాలనీల మధ్య పలుమార్లు సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ రెండు కాలనీలను కలిపే ప్రధాన రోడ్డు నాలాపై నుంచే ఉండడంతో నాలా ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. కొంతమంది రియల్టర్ల ధన దాహంతో ఆపిల్ ఎవెన్యూ కాలనీ ఫేజ్-1, ఫేజ్-2 కాలనీలు ప్రమాదపుటంచున ఉన్నాయి.
కొందరు రియల్టర్ల ధనదాహానికి మాసబ్ చెరువు నాలా ఎక్కడికక్కడ కుం చించుకుపోయింది. ఈ నాలా చుట్టూ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. అంతేకాకుండా మరికొందరు ఆ చెరువు నాలాను పూడ్చేసి అపార్ట్‌మెంట్లనూ నిర్మించారు. దీంతో నాలా నుంచి వచ్చే వరద నీరు ఎక్కడికక్కడే ఆగిపోయి కాలనీల్లోని ఇండ్లలోకి చేరుతున్నది. గత రెండుమూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మాసబ్‌చెరువు నాలా చుట్టూ ఉన్న కాలనీలు నీట మునుగుతున్నాయి. ఇప్పటికే ఆపిల్ ఎవెన్యూ కాలనీలోని ఫేజ్-1, ఫేజ్-2లలో కూడా వరద ఉధృతితో ఇండ్లలోకి వర్షపు నీరు చేరుతున్నది. అలాగే.. మునుగనూరు, తొర్రూరు, కొహెడ, అబ్దుల్లాపూర్‌మెట్ వంటి గ్రామాల్లోనూ ఈ నాలాను ఎక్కడికక్కడ కబ్జా చేశారు.
తుర్కయాంజాల్ మాసబ్‌చెరువు నాలా కబ్జాపై ఇప్పటికే పలువురు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఈ నాలా కబ్జాను ఆయన క్షుణంగా పరిశీలించి.. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటా మని ప్రకటించారు. అయినా ఈ నాలాకు ఇరువైపులా అక్రమ నిర్మాణాలు వెలుస్తుండడం గమనార్హం.