వికారాబాద్, డిసెంబర్ 12,(నమస్తే తెలంగాణ) : ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. నిరుపేదల కడుపు నింపేందుకు అమలు చేస్తున్న ఈ పథకం గత కొన్నేండ్లుగా నిర్వీర్యమవుతున్నది. ఎన్ఆర్ఈజీఎస్ సాఫ్ట్-ఎన్ఐసీ సాఫ్ట్వేర్, కేంద్ర బృందాల తప్పుడు రిపోర్ట్‌లతో కూలీల పొట్ట కొట్టినట్లవుతున్నది. వికారాబాద్ జిల్లాలో గడిచిన రెండేళ్లలోనే 40 లక్షల పని దినాలను తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విధానాల వల్ల వేలాది కుటుంబాలు ‘ఉపాధి’ పనులకు దూరమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం 63.87 లక్షల పనిదినాలను కల్పించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 47.91 లక్షల పనిదినాలను మాత్రమే కల్పించారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో మూడు నెలలే గడువున్నా ఇప్పటి వరకు కేవలం 1,685 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనిని కల్పించగలిగారు. ప్రస్తుతం హరితహారం, నర్సరీలు, భూ అభివృద్ధి పనులు, పంట కాల్వలను తవ్వడం వంటి పనులు సాగుతుండగా, రోజుకు 3,600 మంది కూలీలే పనులకు హాజరవుతున్నారు. జిల్లాలో 95,985 జాబ్ కార్డులుండగా, 1,68,689 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తుంది. కరువును అధిగమించడమే లక్ష్యంగా కొన్నేండ్లుగా పేదల కడుపు నింపేందుకు అమలు చేస్తున్న ఉపాధిహామీ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఉపాధి హామీ తనిఖీల పేరిట పలు జిల్లాల్లో పనులను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని బృందాలు క్షేత్రస్థాయిలో జరిగిన పనులకు భిన్నంగా తప్పుడు రిపోర్ట్‌లతో ఉపాధి హామీ పథకానికి అంతగా ప్రాధాన్యతనివ్వడం లేదు. అదేవిధంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిర్ణయాలతో ఉపాధి హామీ పనులనే నమ్ముకొని బ్రతుకుతున్న కూలీలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. మరోవైపు గత రెండేండ్ల నుంచి ఉపాధి హామీ పనిదినాలను భారీగా తగ్గిస్తూ వస్తున్నారు. కేవలం రెండేళ్లలో 40 లక్షల పనిదినాలను జిల్లాలో తగ్గించడం గమనార్హం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.03 లక్షల పనిదినాలను కల్పించగా, గతేడాది ఏకంగా 31.41 లక్షల పనిదినాలను తగ్గిస్తూ 71.58 లక్షల పనిదినాలను లక్ష్యంగా నిర్ణయించగా, ఈ ఆర్థిక సంవత్సరం 63,87 లక్షలకు పనిదినాలను తగ్గించారు. అదేవిధంగా జిల్లాలో 95,985 జాబ్‌కార్డులుండగా.. 1,68,689 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు.
47.91 లక్షల పనిదినాల కల్పన..
ఈ ఆర్థిక సంవత్సరానికిగాను 63.87 లక్షల పనిదినాలను కల్పించాలని జిల్లా యంత్రాంగం టార్గెట్‌గా నిర్ణయించగా ఇప్పటివరకు 47.91 లక్షల పనిదినాలను కల్పించడం జరిగింది. అత్యధికంగా కులకచర్ల మండలంలో ఉపాధి హామీ కూలీలకు పనిని కల్పించడం జరిగింది. కులకచర్ల మండలంలో అత్యధికంగా 3.98 లక్షల పనిదినాలు, మర్పల్లి మండలంలో 3.79 లక్షలు, పెద్దేముల్ 3.60 లక్షలు, కొడంగల్ మండలంలో 2.94లక్షలు, వికారాబాద్ మండలంలో 2.91లక్షలు, కోట్‌పల్లి మండలంలో 2.79 లక్షలు, ధారూరు 2.75 లక్షలు, నవాబుపేట్ 2.61 లక్షలు, మోమిన్‌పేట్ 2.59 లక్షలు, బంట్వారం 2.72 లక్షలు, దోమ 2.31 లక్షల పనిదినాలను కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ ఏడాది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ఉపాధి హామీ పథకంలో భాగంగా పూర్తైన పనులకుగాను ఈ ఏడాది ఇప్పటివరకు రూ.89.04 కోట్ల చెల్లింపులను పూర్తి చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఒక్కో కూలీకి రోజువారీగా సగటున రూ.196 కూలీ చెల్లిస్తున్నారు. ప్రస్తుతం హరితహారం, నర్సరీలు, భూఅభివృద్ధి పనులు, పంట కాల్వలను తవ్వడం వంటి పనులు జరుగుతుండగా, రోజుకు 3600 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు.
10శాతం కుటుంబాలకు కూడా లభించని వంద రోజుల పని..
ప్రతిఏటా ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిని కల్పించపోగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఈ ఆర్థిక సంవత్సరం వేల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఆర్థిక సంవత్సరంలో కనీసం 10 శాతం మేర కుటుంబాలకు కూడా పనిని కూడా కల్పించలేకపోయారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో మూడు నెలలే గడువున్నా ఇప్పటివరకు కేవలం 1685 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనిని కల్పించారు. అయితే రెండేండ్ల క్రితం వరకు జిల్లాలో ప్రతి ఏటా 20 వేలకుపైగా కుటుంబాలకు వంద రోజులపాటు పనులను కల్పించగా, రెండేండ్లుగా వంద రోజుల పని పొందే కూలీల సంఖ్య రెండు వేలకు కూడా పెరుగకపోవడం గమనార్హం. జిల్లాలోని నవాబుపేట, పూడూరు, వికారాబాద్, కొడంగల్, దోమ మండలాల్లో మాత్రమే 100 కుటుంబాలకుపైగా వంద రోజులపాటు పనిని కల్పించగా, మిగతా 16 మండలాల్లో సింగిల్, డబుల్ డిజిట్‌లోనే కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. అయితే కోట్‌పల్లి మండలంలో అత్యల్పంగా కేవలం 12 కుటుంబాలకు మాత్రమే వంద రోజులపాటు పనిని కల్పించడం గమనార్హం.
కులకచర్ల మండలంలో 17 కుటుంబాలు, యాలాల మండలంలో 21, తాండూరు 23, బషీరాబాద్ 47, దౌల్తాబాద్ 28, పరిగి 35, ధారూరు మండలాల్లో 29 కుటుంబాలకు వంద రోజుల పనిని కల్పించారు. అయితే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ సాఫ్ట్-ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌తో జిల్లాలోని లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. కొత్త సాఫ్ట్వేర్ విధానంతో కూలీలు తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం పనులకు తప్పనిసరిగా హాజరుకావాలని షరతులను విధించింది. కూలీలు చేస్తున్న పనులకు సంబంధించి ఉదయం 11 గంటలలోపు ఒక ఫొటో, సాయంత్రం 2 గంటల తర్వాత రెండో ఫొటో తప్పనిసరిగా తీయడంతోపాటు అప్లోడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒక గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి ఒక పని పూర్తైన తర్వాతనే మరొక పని చేపట్టాలని నిబంధన విధించారు. దీంతో గతంలో మాదిరిగా కాకుండా పనులు చాలా ఆలస్యమవుతున్నాయి. అంతేకాకుండా ప్రతిరోజూ చేపడుతున్న పనులను వెంటనే యాప్‌లో పొందుపర్చాలనే నిబంధనలతో క్షేత్రస్థాయిలో సిగ్నల్ లేకపోవడంతో అప్లోడ్ చేయడం ఇబ్బందిగా మారి పనులు కూడా జాప్యం జరుగుతున్నాయి.