Anganwadi Eggs | పెద్దఅంబర్‌పేట, అక్టోబర్ 23 : కోడి గుడ్డు చిన్నబోయింది. బాలింతలు, పసికందులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న కోడి గుడ్లు చిన్న సైజులో దర్శనమిస్తున్నాయి. అరచేతిలో ఆరు గుడ్లు పడుతున్నాయంటే వాటి సైజు ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులు ఈ చిన్న సైజు గుడ్లు ఏమిటని సిబ్బందిని అడిగితే కాంట్రాక్టర్ అలాగే వేశారని చెబుతున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 77 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్ మున్సిపాలిటీలు కలిపి 41 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. గ్రామ పంచాయతీల్లో 36 కేంద్రాలు ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఒక్కో అంగన్వాడీ సెంటర్‌కు సగటున 400 నుంచి 1200కు పైగా గుడ్లు వస్తున్నాయి.
పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని పెద్దఅంబర్‌పేట, కుంట్లూరు, పసుమాముల, తట్టిఅన్నారం, ఆర్కేనగర్, మర్రిపల్లి తదితర ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేస్తున్న కోడి గుడ్లు చిన్నసైజులో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడు గుడ్ల సైజు చిన్నగా ఉంటున్నాయని, ఈసారి మరీ దారుణంగా అరచేతిలో ఐదారుకు పైగా గుడ్లు పట్టే పరిస్థితి ఉన్నదని చెబుతున్నారు. తప్పని పరిస్థితుల్లో తీసుకెళ్తున్నామంటున్నారు. దీనిపై ఐసీడీఎస్ సూపర్వైజర్ వనజ మాట్లాడుతూ చిన్నగుడ్లు వస్తే కాంట్రాక్టర్‌కు తిరిగి అప్పగిస్తామని, నాణ్యమైన గుడ్లనే లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. ఈ విషయంపై అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడుతామన్నారు. లబ్ధిదారులు ఇప్పటికే గుడ్లు తీసుకెళ్తే.. అంగన్వాడీ కేంద్రాల్లో తిరిగి ఇచ్చేలా చూస్తామన్నారు. నాణ్యమైన, మంచి సైజులో ఉన్న గుడ్లను అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.