ఆదిబట్ల, ఆగస్టు 1 : ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమానికి ఆగస్టు 10 వరకు గడువు పొడిగించిన నేపథ్యంలో లభించిన అదనపు సమయాన్ని పూర్తిగా నాణ్యత పెంపునకు వినియోగించాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఎస్ఐఆర్ అమలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రారంభంలో రాష్ట్ర సగటుతో పోలిస్తే డిజిటలైజేషన్ వేగం తక్కువగా ఉండటంతో పురోగతిని సమీక్షించేందుకు జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే డిజిటలైజ్ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు, ఫొటోలు, పత్రాల అప్‌లోడ్‌లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు.
ఈఆర్వోలు, ఏఈఆర్వోలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నాణ్యతను ధ్రువీకరించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, అత్యవసర పరిస్థితిలో మాత్రమే ప్రైవేట్ భవనాలను వినియోగించాలన్నారు. మరణించిన, చిరునామా మార్చుకున్నా లేదా గుర్తింపులేని ఓటర్ల వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో ధ్రువీకరించాలని సూచించారు. అవసరమైతే అదనపు సహాయ ఎన్నికల నమోదు అధికారులను నియమించి పనిభారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు. ఓటర్ల జాబితాల్లో పేర్లు గుర్తించలేకపోతున్నామని, బీఎల్వోలు అందుబాటులో లేరనే ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి వస్తున్నాయని పేర్కొంటూ, ప్రజలకు పూర్తి సహకారమందించి అవసరమైన దరఖాస్తులు స్వీకరించాలని బీఎల్వోలకు సూచించారు.
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 3,501 పోలింగ్ కేంద్రాలు., 36,99,743 మంది ఓటర్లు ఉన్నారని., ప్రస్తుతం 63.53 శాతం మ్యాపింగ్, డూప్లికేట్, తదితర కేసులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఆగస్టు 10 వరకు గడువు పొడిగించడం జిల్లాకు ఎంతో ఉపయోగకరంగా మారిందని, ఈ అదనపు సమయాన్ని పూర్తిగా వినియోగించి ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పారు. బీఎల్వోలు, బీఎల్ఏలతో కలిసి పెండింగ్ కేసులను సంయుక్తంగా ధ్రువీకరిస్తూ అవసరమైన చోట ఓటర్లను నేరుగా సంప్రదించి వివరాలు సేకరిస్తామని తెలిపారు.
రాజకీయ పార్టీలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి అపోహలను తొలగించామని అవసరమైతే మరిన్ని సమావేశాలు నిర్వహించామని పేర్కొన్నారు. సమీక్ష అనంతరం భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌కుమార్, అదనపు కలెక్టర్ కిరణ్మయితో కలిసి ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని కొంగరకలాన్, బొంగుళూరు గ్రామాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్వోలతో మాట్లాడి ప్రక్రియ అమలు, ఎదురవుతున్న సమస్యలు, ప్రజల స్పందనపై వివరాలు తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్మయి, చంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, సర్కిల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.