సిటీ బ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ) : ఆన్లైన్లో చికెన్, మటన్, చేపలు ఆర్డర్ చేస్తున్నారా…? అయితే మీరు ప్రాణాంతక వ్యాధులు కొనితెచ్చుకుంటున్నట్లే.. అవును.. ఆన్లైన్ యాప్ల ద్వారా డెలివరీ చేస్తున్న మాంసం ఏ మాత్రం స్వచ్ఛమైనది కాదని అనేక నివేదికలు హెచ్చరిస్తున్నాయి. మాంసం తాజాగా కనిపించేందుకు ప్రమాదకర రసాయనాలను కలిపి విక్రయిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులను ఆన్లైన్ ద్వారా ఫ్రీగా డెలివరీ చేస్తున్నారు. ఆన్లైన్ డెలివరీ యాప్ సంస్థలు, వాటి గోడౌన్లలో నిరంతర తనిఖీలు చేపట్టకపోవడంతో ఇష్టారీతిన నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయిస్తున్నాయి.
యాప్ నిర్వాహకులు ఇచ్చే ఆఫర్లు, ప్రదర్శిస్తున్న నిబంధనలను చూసి వినియోగదారులు ఘోరంగా మోసపోతున్నారు. ప్రాణాలకు ముప్పు తెచ్చే వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. దుకాణానికి వెళ్లి తెచ్చుకునే సమయం లేదనో.. కావాల్సిన, నచ్చిన మాంసం పది నిమిషాల్లోనే ఇంటికే వస్తుందనే భావనతోనో.. నగర ప్రజలు ఆన్లైన్ యాప్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా పలు ఈ కామర్స్ సంస్థలు వినియోగదారుల బలహీనతను క్యాష్ చేసుకుంటున్నాయి. రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసానికి ఆర్డర్ చేసిన తేదీతో ఫుడ్ సేఫ్టీ లోగోలను ముద్రించి విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి.
ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులకు అందిస్తున్న మాంసం ముమ్మాటికీ స్వచ్ఛమైనది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తాజా మేక, గొర్రె మాంసాన్ని కూడా కేవలం పది నిమిషాల్లోనే ఇంటి వద్దకే తీసుకు రావడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఎందుకంటే అప్పటికే కోసి ఉంచిన మాంసమైనా చిన్న ముక్కలుగా చేసి, ప్యాకింగ్ చేయడానికే కనీసం పది నిమిషాలు పడుతుంది. అదేవిధంగా చేపలను కూడా ముక్కలుగా కోసి, కడిగేసరికి కనీసం పది నిమిషాలు పడుతుంది. కానీ ఈ కామర్స్ సంస్థల డెలివరీ బాయ్స్ మాత్రం ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే ఇంటి ముందుకు వాలిపోతున్నారు.
అది ఎలా సాధ్యమవుతుందనే అనుమానమే రాకుండా తొందరగా వచ్చింది కదా.. అని సంబరపడుతూ వండుకుని తినేస్తున్నారు. ఈ కామర్స్ సంస్థల గోడౌన్లలో అప్పటికే తీసుకొచ్చి కేజీ, అరకేజీ, పావు కేజీల లెక్కన ప్యాక్ చేసి నిల్వ ఉంచుతున్నారు. వినియోగదారులు ఆర్డర్ చేసిన వెంటనే వాటిని డెలివరీ చేస్తున్నారు. అలా రోజుల తరబడి నిల్వ ఉంచడంతో అందులో కలిపిన రసాయనాల వల్లే మాంసం పైకి తాజాగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పది నిమిషాల్లోనే డెలివరీ వెనుక జరిగేదంతా పట్టించుకోకుండా సమయం, డబ్బు ఆదా అవుతుంది కదా.. అని విషపు మాంసాన్ని రుచికరంగా ఉందంటూ లాగించేస్తున్నారు.
మాంసం, చేపలు, రొయ్యలు తాజాగా కనిపించడానికి ఈ కామర్స్ సంస్థల గోడౌన్లలో అత్యంత ప్రమాదకరమైన సోడియం నైట్రైట్ తదితర రసాయనాలను కలుపుతారు. వీటి వల్ల మాంసం అప్పుడే కోసిన దానిలా లైట్ పింక్ కలర్లో ఉండి తాజాగా కనిపిస్తుంది. కానీ సోడియం నైట్రైట్ తదితర రసాయనాలు కలిసిన మాంసంతో అనేక క్యాన్సర్లకు కారణమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే అనేకసార్లు హెచ్చరించింది.
ఈ రసాయనాలను మాంసాన్ని నిల్వ చేసేందుకు ప్రిజర్వేటర్లుగా వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. వీటికి బదులు ఆహార ఉత్పత్తుల్లో మరో సహజ, ప్రాణాంతకం కాని పదార్థాలను వాడాలని సూచించింది. పలు అంతర్జాతీయ సంస్థల పరిశోధనల్లోనూ ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ కోసం వినియోగిస్తున్న ఈ రసాయనాలు ప్రాణాంతకమని వెల్లడైంది.
ఈ కామర్స్ సంస్థలు డెలివరీ చేసే మాంసం తాజాగా ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు వాడే సోడియం నైట్రైట్ తదితర రసాయనాల వల్ల అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ రసాయనాలు కలిపిన మాంసాన్ని తిన్నవారిలో పేగు, జీర్ణాశయ క్యాన్సర్లు సంభవిస్తాయి. నరాలు, కిడ్నీల పనితీరును తీవ్రగా ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా జన్యు నిర్మాణంలో అసమానతలు కలిగించి జెనెటిక్ వ్యాధులు ప్రబలడానికి కారణమవుతున్నాయి.
ముఖ్యంగా నూతనంగా వివాహమైన మహిళల్లో ఈ రసాయనాలు గర్భ నిరోధకాలుగా పనిచేస్తాయని పలు అధ్యయనాలు తేల్చాయి. గర్భం దాల్చినవారిలో గర్భస్రావానికి దారితీస్తున్నాయి. అదేవిధంగా చిన్నపిల్లల్లో అనేక జన్యు సంబంధిత వ్యాధులు సంభవిస్తున్నాయి. మానసిక, శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలంటే ఆన్లైన్ డెలివరీ యాప్లను సంప్రదించకుండా దుకాణాల్లో తాజా మాంసాన్నే కొనుగోలు చేసి బాగా ఉడికించి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఆహార ఉత్పత్తుల కొనుగోలులో ఆన్లైన్ డెలివరీ యాప్లను సంప్రదించకపోవడమే మంచిదని హెచ్చరిస్తున్నారు.