నూతన సంవత్సరం సందర్భంగా రంగారెడ్డిజిల్లాలో గత రెండు రోజుల్లో సుమారు రూ.55 కోట్ల విలువచేసే మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నగర శివారుల్లో విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడాలేని విధంగా మద్యాన్ని విక్రయించారు. జిల్లాలో సరూర్‌నగర్, శంషాబాద్‌లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాలుండగా.. వీటి పరిధిలో వందలాది మద్యం దుకాణాలున్నాయి. వీటిలో మంగళవారం డిసెంబర్ 31 రాత్రితో పాటు జనవరి 1న బుధవారం రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. అలాగే, జిల్లా పరిధిలో అత్యధికంగా రిసార్టులు, ఫాంహౌస్లుండటంతో పెద్దఎత్తున ఈవెంట్లు కూడా జరిగాయి. దీంతో ఇక్కడ మద్యం వరదలై పారింది. ఎక్కడికక్కడ పోలీసులు డ్రంక్అండ్డ్రైవ్లు నిర్వహించినప్పటికీ మద్యం అమ్మకాలు తగ్గకపోవడం గమనార్హం.
– రంగారెడ్డి, జనవరి 1 (నమస్తే తెలంగాణ)
ఫౌంహౌస్లపై పోలీసుల దాడులు
చేవెళ్ల రూరల్, జనవరి 1 : నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అనుమతులు లేకుండా పార్టీలు నిర్వహిస్తున్న రెండు ఫౌంహౌస్లపై పోలీసులు దాడులు చేశారు. మద్యం, హుక్కాతోపాటు వాటిని సేవిస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి కథనం ప్రకారం.. చేవెళ్ల మండల పరిధి ముడిమ్యాల్ గ్రామంలోని జడ్ఎన్ ఫౌంహౌస్, మ్యాంగో రిట్రీట్ ఫాంహౌస్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా మంగళవారం రాత్రి న్యూ ఇయర్ పార్టీ నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ రెండు ఫౌంహౌస్లపై దాడులు చేయగా కొందరు వ్యక్తులు మద్యం, హుక్కా సేవిస్తూ కనిపించారు. వెంటనే వాటితో పాటు వీరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న డీజే సౌండ్ సిస్టంను కూడా సీజ్ చేశారు. రెండు ఫౌంహౌస్‌లు, డీజే యజమానులతో పాటు వీటిని అద్దెను తీసుకున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.