యాచారం/మంచాల, సెప్టెంబర్ 12 : అర్ధరాత్రి సమయంలో ఆకాశంలో డ్రోన్లు సంచరించడం యాచారం, మంచాల మండలాల్లో తీవ్ర కలకలం రేపుతున్నది. యా చారం మండలంలోని చింతపట్ల, మొండిగౌరెల్లి గ్రామాల్లో గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ ఐదారు డ్రోన్లు ఆకాశంలో సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
మంగళవారం రాత్రి మొండిగౌరెల్లి, చింతపట్ల గ్రామాల్లో.. బుధవారం రాత్రి చింతపట్లలో వరుసగా నాలుగు నుంచి ఏడు డ్రోన్లు గాల్లో తిరగడాన్ని గ్రామస్తులు గమనించి.. తమ సెల్ఫోన్లలో రికార్డు చేశారు. అదేవిధంగా మం చాల మండలంలోని చీదేడు, రంగాపూర్, జాపాల, మంచాల, కాగజ్‌ఘట్ గ్రామాలపై బుధవారం రాత్రి 9 నుంచి సుమారు 11 గంటల వరకు ఆరు డ్రోన్లు గ్రామా ల్లోని బిల్డింగ్‌లకు అతి సమీపం నుంచి తిరిగినట్లు ప్రజలు పేర్కొంటున్నారు.
పోలీసులు, అధికారుల అనుమతుల్లేకుండా డ్రోన్లు ఎందుకు గ్రామాల్లో అర్ధరాత్రి సమయంలో తిరుగుతున్నాయని.. వాటిని ఎవరు, ఎక్కడి నుంచి ఎందుకోసం ఎగురేస్తున్నారని గ్రామాల ప్రజల ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. పైగా అర్ధరాత్రి ఆకాశంలో పంటపొలాలు, గొర్రెలు, మేకల మందలు ఉన్న చోటే డ్రోన్లు గంటల తరబడి తిరుగుతుండడంతో పలు అనుమానాలకు తావిస్తున్నది. రాత్రిపూట గ్రామాల్లో డ్రోన్లు సంచరించడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు.
చింతపట్ల గ్రామం లో ఇటీవల బోరుమోటరు, గొర్రెలు, గొర్రె పొట్టేలు, మేకలు, ట్రాక్టర్ల నుంచి బ్యాటరీలు చోరీకి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఇలా గ్రామంలో వరుసగా చోరీలు చోటుచేసుకుంటున్న తరుణంలో అర్ధరాత్రి సమయంలో డ్రోన్లు తిరుగుతుండడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. గ్రామంలోని పంట పొలాల వద్ద ఉన్న విలువైన వస్తువులు, గొర్రెలు, మేకలను అపహరించుకుపోయేందుకు దుండగులు డ్రోన్ల సహాయంతో ఆరా తీస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.
ఎవరైనా ఏదైనా ఉపద్రవాన్ని సృష్టించేందుకేనా..? అని భయపడుతున్నారు. గ్రామాల్లో అనుమతుల్లేకుండా డ్రోన్లు తిరుగుతుండడంపై పోలీసులు దృష్టి సారించారు. మొం డిగౌరెల్లి, చింతపట్ల గ్రామాల్లో డ్రోన్ల కదలికలపై నిఘా పెట్టారు. స్థానికులూ డ్రోన్ల రహస్యాన్ని గుర్తించేందుకు గ్రామాల్లో జాగారం చేస్తున్నారు. పోలీసులు డ్రోన్లను అనుసరించగా అవి మొండిగౌరెల్లి నుంచి నేరుగా మంచాల మండలంలోని దాద్‌పల్లి గుట్టల ప్రాంతాలకు వెళ్లినట్లు గుర్తించారు.
తాజాగా మండలంలోని మేడిపల్లిలో ..మంచాల మండలంలోని రంగాపూర్‌లో డ్రోన్ల కదలికలు ఉన్నట్లు ఆయా గ్రామాలవాసులు పేర్కొన్నారు. రోజుకో గ్రామంలో డ్రోన్ల సంచారం కలకలం రేపుతున్నది. మొండిగౌరెల్లి, చింతపట్ల, మేడిపల్లి గ్రామాల్లో ప్రత్యేక నిఘాపెట్టినట్లు యాచారం, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐలు శంకర్‌కుమార్, నరసింహారావు తెలిపారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.