ధారూరు, సెప్టెంబర్ 13 : మండలంలోని మున్నూరుసోమారం, రుద్రారం గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రెండు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడింది. మున్నూరుసోమారంలో సమస్య తీవ్రంగా ఉండడంతో వాటర్ ట్యాంకర్ ద్వారా సరఫరా చేశారు. అయినా సరిపోకపోవడంతో స్థానికులు ఆటోలు, బైకులపై వ్యవసాయ బోర్ల నుంచి తెచ్చుకుంటున్నారు. గ్రామంలోని ఎస్సీకాలనీలో పైపులైన్ పగిలి పోవడంతో వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు రావడంలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దళితులు తాగునీటికోసం అల్లాడుతుంటే అధికారులు పట్టించుకోవడంలేదని కేవీపీఎస్ మండల నాయకులు యాదయ్య, జంగయ్య, దశరథ్, నర్సింహులు, రాంచంద్రయ్య.. అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రాజు, శ్రీనివాస్, హనుమంతు, నర్సింహులు, రవీందర్ తదితరులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, రుద్రారంలోనూ మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వికారాబాద్ : కేసీఆర్ ప్రారంభించిన పథకాలను కూడా అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదన్నారు. ధారూరు మండలంలోని మున్నూరుసోమారంలో నీటి కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
దూర ప్రాంతాల నుంచి ఆటోల్లో బిందెలు, డ్రమ్ములతో నీటిని తెచ్చుకోవడం, ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కడం బాధాకరమన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చడం మీకు ఎలాగో సాధ్యం కాదు.. కనీసం కేసీఆర్ ప్రారంభించి, ఇంటింటికీ తాగునీటిని అందించిన మిషన్ భగీరథ పథకాన్నైనా సక్రమంగా అమలు చేయలేరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేండ్లలో ఎప్పుడూ లేని నీటి ఎద్దడి ఇప్పుడెందుకు వచ్చిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మంచి నీటి కోసం మహిళలను రోడ్డెక్కించిందని దుయ్యబట్టారు.