వికారాబాద్, జూలై 30 : పంట రుణమాఫీపై రైతులు ఎలాంటి అపోహలకు తావివ్వొద్దని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం రైతు నేస్తం పథకం ద్వారా రెండో విడుత రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాన్ని రైతులు, పీఏసీఎస్ చైర్మన్లు, వ్యవసాయ అధికారులతో కలిసి కలెక్టర్ ఆన్లైన్ ద్వారా వీక్షించారు.
ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని, రైతులకు ఎలాంటి సందేహం ఉండకూడదన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు అర్హులైన లబ్ధిదారులకు రుణమాఫీ జరుగుతున్నదన్నారు. ప్రతి రైతు కుటుంబానికీ రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ చేయడంలో భాగంగా మొదటి విడుతలో వికారాబాద్ జిల్లాలో 46,633 మంది లబ్ధిదారులకు రూ.256.26 కోట్లు రుణమాఫీ అయ్యిందన్నారు.
రెండో విడుత రుణ మాఫీలో భాగంగా జిల్లాలో 26,438 మంది లబ్ధిదారులకు రూ.262.64 కోట్లు నిధులు విడుదలయ్యాయని తెలిపారు. రుణమాఫీ అయిన రైతులు కొత్తగా రుణాలు పొందే అవకాశం ఉన్నదని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు రుణమాఫీ చెక్కులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాకు రూ.262.64 కోట్ల నిధులు విడుదల..
వికారాబాద్ జిల్లాలో రైతు నేస్తంలో భాగంగా రెండో విడుత పంట రుణ మాఫీ కింద రూ.లక్షా 50 వేల లోపు ఉన్న రుణాలకుగాను రూ.262.64 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. రెండో విడుతలో జిల్లావ్యాప్తంగా 26,438 రైతు కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు.
జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గంలో 7,442 మంది లబ్ధిదారులకు 74.95 కోట్లు, తాండూరు నియోజకవర్గంలో 5,376 మంది రైతులకు 52.93 కోట్లు, పరిగి నియోజక వర్గంలో 6,166 మంది రైతులకు 62.06 కోట్లు, కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాలకు సంబంధించి 6,057 మంది రైతులకు రూ.61 కోట్ల రుణమాఫీతో పాటు చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలంలోని 1,397 మంది లబ్ధిదారులకు రూ.11.7 కోట్ల రుణమాఫీ చేసినట్లు పేర్కొన్నారు. రుణమాఫీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి, జిల్లా సహకార అధికారి ఈశ్వరయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మంజులారమేశ్, పీఏసీఎస్ చైర్మన్లు సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, మొగులయ్య, సంతోష్ రెడ్డి, జయకృష్ణ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.