వికారాబాద్, మే 28 : చేవెళ్ల లోక్సభ కౌంటింగ్ ప్రక్రియలో చిన్న పొరపాటు కూడా జరగొద్దని జిల్లా ఎన్నికల అధికారి, వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు కౌంటింగ్ రోజున చేపట్టే విధివిధానాలపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. ఓట్ల లెక్కింపు రోజున చిన్న పొరపాటూ జరుగకుండా మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ సూపర్వైజర్లు విధులు నిర్వహించాలన్నారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ బృందాల వారీగా చేపట్టాల్సి ఉంటుందని.. ఆర్వోల వద్ద ఆర్డర్ కాపీలు, ఐడీ కార్డులను తీసుకోవాలన్నారు. కౌంటింగ్ రోజున ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించాలని..8:30 గంటలకు ఈ వీఎంల లెక్కింపును ప్రారంభించాలన్నారు.
కౌంటింగ్ సూపర్వైజర్లు కంట్రోల్ యూనిట్ ఆయా పోలింగ్ స్టేషన్లకు సంబంధించినదా..? కాదా..? అని చెక్ చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో కంట్రోల్ యూనిట్లో న మోదైన మొత్తం ఓట్లు, ఫారం17సిలో నమోదైన ఓట్లు సరిచూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ , ఆర్డీవోలు వాసుచంద్ర, శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్లు రాంరెడ్డి , వీరాకాంతం, సంబంధిత ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.