ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నంలోని జిల్లా అదనపు జడ్జీ కోర్టును త్వరలో ప్రారంభించనున్నట్లు హైకోర్టు జడ్జీ అభిషేక్‌రెడ్డి తెలిపారు. శనివారం ఇబ్రహీంపట్నం కోర్టును ఆయన తనిఖీ చేసి కోర్టులో నెలకొన్న సమస్యలు, అడ్వకేట్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారం కోసం నేరస్తులు దూర ప్రాంతాలకు వచ్చి ఇబ్బందులు పడకుండా త్వరలోనే జిల్లా అదనపు జడ్జీకోర్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో కేసులు పెద్ద ఎత్తున ఇక్కడే పరిష్కారం అయ్యేందుకు వీలుంటుందని అన్నారు. త్వరలో కొత్తగా నిర్మించబోయే కోర్టు సముదాయ నిర్మాణంలో మార్పులు, సలహాలు, సూచనలు చేశారు.
కోర్టు ప్రాంగణాన్ని కలియ తిరిగి ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కోర్టులో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ప్రధాన జూనియర్ న్యాయమూర్తిగా ముదిగొండ రాజును నియమించారు. అలాగే, ప్రసుత్తం జూనియర్ అదనపు న్యాయమూర్తిని బదిలీ చేస్తూ ఆమె స్థానంలో అనామికను నియమించినట్లు తెలిపారు. అనంతరం ఇబ్రహీంపట్నం కోర్టు ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. హైకోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టిన అభిషేక్‌రెడ్డి మొదటిసారిగా ఇబ్రహీంపట్నం కోర్టుకు వచ్చిన సందర్భంగా సీనియర్ న్యాయమూర్తి ఇందిర ఆధ్వర్యంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్, వెంకటేష్, జూపాల్, జగన్, న్యాయవాదులు వెంకట్‌నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహారెడ్డి, అరుణ్‌కుమార్, మాదన్న, మహేందర్, నరేందర్, రవి, జగన్ పాల్గొన్నారు.