కేశంపేట, మే 25 : ఏ నలుగుర్ని కదిలించినా ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పైనే చర్చించుకుంటున్నారు. మండలంలోని వేముల్‌నర్వ గ్రామానికి చెందిన విజయలక్ష్మి అలియాస్ భూమిక(40) ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిందన్న వార్త ప్రచారం నేపథ్యంలో అందరూ ఆమె గురించే చర్చించుకుంటున్నారు. ఎన్కౌంటర్ విషయం తెలియగానే మొదట్లో కంగారుపడి భయాందోళనకు గురైన మండల ప్రజలు మెల్లగా తేరుకొని సమాజ హితం కోసం ఆమె ఎంచుకున్న పోరాట పంథాపై మాట్లాడుకుంటున్నారు.
మారుమూల పల్లెకు చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువతి ఉన్నత విద్యను అభ్యసించి.. అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తేందుకు ఆమె ఎంచుకున్న దారి, చూపిన తెగువ వెలకట్టలేనిదని కొనియాడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన మలి దశ ఉద్యమంలో విజయలక్ష్మి చురుగ్గా పాల్గొన్నదని.. ఉస్మానియా వేదికగా జరిగిన పలు ఆందోళన కార్యక్రమాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఫొటోలను మండలంలోని యువత షేర్ చేసుకుంటూ ఆమె పోరాట పటిమను గుర్తు చేసుకుంటున్నారు.
విజయలక్ష్మి భౌతికకాయాన్ని గ్రామానికి తీసుకొచ్చేందుకు కుటుంబసభ్యులు మొదట్లో కొంత సంశయించినా సమాజం కోసం ఆమె తన ప్రాణాలను అర్పించిందని ప్రజా సంఘాలు, మేధావులు నచ్చజెప్పడంతో.. కుటుంబ సభ్యులు వేముల్‌నర్వ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలివెళ్లారు. ప్రభుత్వ నిబంధనలను పూర్తి చేసి ఆమె భౌతిక కాయాన్ని గ్రామానికి తీసుకురానున్నారు.