ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు అగ్గువకే బయటి మార్కెట్లో వడ్లను అమ్ముకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించకపోవడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. వడ్లు అరబెట్టేందుకు కల్లాలు లేకపోవడంతో కొంతమంది పొలాల వద్ద వడ్లను ఆరబెట్టుకుంటుండగా, మరికొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తూ అగ్గువకు అమ్ముకుని నష్టపోతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మొదటగా పంటలకు యూరియా కొరతతో నెల రోజులు కార్యాలయాల వద్ద పడిగాపులు కాసి అవస్థలు పడాల్సి వచ్చింది. అనంతరం అకాల వర్షాలతో పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. చివరకి చేతికొచ్చిన కొద్దిపాటి పంటనైనా మార్కెట్లో అమ్ముకుందామంటే ప్రభుత్వం సక్రమంగా కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో తిప్పలు పడుతున్నారు.
– షాబాద్, నవంబర్ 20
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కుగాను అన్నదాతలు 1.68 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. ఇందుకుగాను సర్కారు కొనుగోలు కేంద్రాలకు 30 వేల మెట్రిక్ టన్నుల వరకు వరిధాన్యం వస్తుందని అంచనా వేయగా.. సరిపడా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడంలేదు. ప్రభుత్వ మద్ధతు ధర వరి క్వింటాల్‌కు రూ.2389 ఉండగా.. రూ.500 బోనస్‌తో కలిపి రూ.2889 వస్తుందని ఆశించినా అన్నదాతలకు నిరాశే మిగిలింది. అందుబాటులో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో బయట రైతులు క్వింటాల్ వరిని రూ.2100 నుంచి రూ.2300 వరకు అమ్ముకుంటూ క్వింటాల్‌కు రూ.700 వరకు నష్టపోతున్నారు.
కనిపించని కొనుగోలు కేంద్రాలు
జిల్లావ్యాప్తంగా పది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో వడ్లను అమ్ముకునేందుకు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం సర్దార్‌నగర్, మోకిల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వడ్లు సేకరించేది. కానీ గత ఏడాది నుంచి ఈ రెండు కేంద్రాలు తెరవడంలేదు. ఇక్కడి రైతులు వడ్లు అమ్ముకోవాలంటే షాద్‌నగర్‌కు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచి వడ్లు తెచ్చి ఎలా విక్రయించాలని అన్నదాతలు వాపోతున్నారు. గత 20 రోజులుగా వరికోతలు నడుస్తున్నాయి. సర్కారు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తమ పొలాల వద్ద, ఖాళీ స్థలాల్లో వడ్లను అరబెట్టుకుంటున్నారు. కల్లాలు లేక అనేక అవస్థలు పడుతున్నారు.
అగ్గువకు అమ్ముకుంటున్న రైతులు
ప్రభుత్వం వరి ధాన్యానికి మద్దతు ధర క్వింటాల్‌కు ఏ-గ్రేడ్ రూ.2389, బీ-గ్రేడ్‌కు రూ.2360 ప్రకటించింది. దీంతో ఒకవైపు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడం, మరోవైపు వడ్లను ఆరబెట్టడానికి కల్లాలు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకే వడ్లను విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవ్రేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.2100 నుంచి రూ.2300 ధరకు కొనుగోలు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. అందులో కూడా క్వింటాల్‌కు ఒక కిలో కటింగ్, అప్పుడే డబ్బులు కావాలంటే నూటికి రూ.2 కటింగ్ చేస్తుండడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతుబిడ్డగా కేసీఆర్ రెండు పంటలకు పెట్టుబడి సాయం అందించడంతోపాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేసేవారని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు బోనస్ పేరుతో ఉన్న ధాన్యాన్ని సరిగ్గా కొనలేక ఇబ్బందులకు గురి చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు.
రూ.2300లకు బయటి మార్కెట్లో విక్రయించాను
రెండు ఎకరాల్లో వరిపంట వేశాను. వర్షాలతో సగం వరకు పంట పాడైపోయింది. మళ్లీ వర్షాలు వస్తే ఉన్నది కూడా నాశనమైతుందని పంటను కోయించాను. ప్రభుత్వం వడ్లు కొనకపోవడంతో బయటి మార్కెట్‌కు తీసుకుపోతే రూ.2300లకు కొనుగోలు చేశారు. పెట్టుబడులు కూడా రాలేదు. రైతుల కోసం అనేక పనులు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న సర్కారుకు.. రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు పడుతున్న అవస్థలు కనిపించడంలేదా..?
– కుమార్‌యాదవ్, రైతు, కుమ్మరిగూడ, షాబాద్
రైతులను మోసం చేసిన కాంగ్రెస్
ఎన్నికల్లో అమలు కాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు, రైతులను మోసం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేసీఆర్ అన్నీ తానై చూసుకున్నారు. పంటలు వేసిన నాటి నుంచి అమ్ముకునే వరకు రైతులకు అండగా నిలిచారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు బోనస్ పేరిట అన్నదాతలను నిండాముంచింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు వడ్లను అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. రాబోవు రోజుల్లో అన్నదాతలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.
– భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత, షాబాద్ మండలం