వికారాబాద్, డిసెంబర్ 24, (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వికారాబాద్ జిల్లా వికసించింది. తొమ్మిదిన్నరేండ్లలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగింది. ఆస్తులు కాదు అప్పులు పెరిగాయన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలపై తొమ్మిదిన్నరేండ్ల అభివృద్ధిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వేదపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లాకు సాగు నీరందించేందుకుగాను పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 80 శాతం పనులు పూర్తి చేసిన విషయం వెల్లడించారు. అంతేకాకుండా ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరందించి ప్రజల దాహార్తిని తీర్చిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర పథకాలతోపాటు జిల్లా ఏర్పాటు చేయాలనే వికారాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చింది.
అంతేకాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాలో గడిచిన తొమ్మిదిన్నరేడ్ల కాలంలో కనీవినీ ఎరుగని అభివృద్ధికిగాను బీఆర్ఎస్ ప్రభుత్వం తోడ్పాటునందించింది. పూర్తిగా గ్రామీణ ప్రాంతంతో కూడిన వెనుకబడిన జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకుగాను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని వికారాబాద్ ప్రాంతం జిల్లాగా ఏర్పాటైన అనంతరం జిల్లా అంతటా ఎంతో ప్రగతి జరిగింది. జిల్లాగా ఆవిర్భవించిన అనంతరం జిల్లాకు వివిధ అభివృద్ది పనులకుగాను బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.7వేల కోట్ల వరకు నిధులను విడుదల చేసింది. ప్రధానంగా జిల్లాలోని మోమిన్పేట్ మండలంలో ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రానిక్ వాహనాల విడిభాగాల తయారీ యూనిట్ అయిన మొబిలిటీ వ్యాలీ జిల్లాకు మణిహారంగా మారనుంది.
రూ.50 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా మొబిలిటీ వ్యాలీని ప్రభుత్వం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తుంది. పేదలకు సత్వర వైద్య సేవలు జిల్లాలో పేద ప్రజలకు సత్వర వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని అందుబాటులోకి తీసుకురావడంతోపాటు ఆయుష్ దవాఖాన, క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేందుకుగాను పాలియేటివ్ కేర్ కేంద్రాన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసింది. అంతేకాకుండా నర్సింగ్ కాలేజీతోపాటు మాతాశిశు సంరక్షణ ఆసుపత్రితోపాటు మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖనాలు, గ్రామ పంచాయతీల్లో పల్లె దవాఖానలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అందుబాటులోకి తీసుకువచ్చి పేదలకు గ్రామస్థాయిలోనే వైద్య సేవలనందిస్తున్నారు.
అదేవిధంగా తొమ్మిదిన్నరేడ్లలో జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయి. తాండూరులో కాలుష్యాన్ని తగ్గించేందుకుగాను బైపాస్ రోడ్డును మంజూరు చేయడంతోపాటు మెజార్టీ గ్రామ పంచాయతీలకు రోడ్లులేని పరిస్థితి నుంచి ప్రతీ గ్రామానికి రోడ్లను నిర్మించడంతోపాటు గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి లింక్ రోడ్ల ఏర్పాటు వరకు జిల్లాలో అభివృద్ధి వేగవంతమైంది. జిల్లాలో రూ.1500 కోట్లతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి, వంతెనల నిర్మాణం చేపట్టారు.
అదేవిధంగా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతోపాటు మున్సిపాలిటీల సంఖ్యను పెంచి మున్సిపాలిటీలను సుందరంగా తీర్చిదిద్దేందుకు నిధులిచ్చి కనీవినీ ఎరుగని అభివృద్ధి చేసింది. అదేవిధంగా జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కూడా వేగంగా జరుగుతుంది. మరోవైపు జిల్లాలోని జిన్గుర్తి, అర్కతలలో ఫుడ్ ఇండస్ట్రీయల్ పార్కులను బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది. పారిశ్రామికరంగంలో తీసుకువచ్చిన మార్పులతో అధిక మొత్తంలో పరిశ్రమల ఏర్పాటుతోపాటు వికారాబాద్ జిల్లాకు రూ.1530కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. అంతేకాకుండా సబ్బండ వర్గాల సంక్షేమానికిగాను అధిక ప్రాధాన్యతనిచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు బీసీ భవన్, గిరిజన భవన్లను కూడా మంజూరు చేసింది.