వికారాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నా.. జిల్లాలో మాత్రం గం జాయి అక్రమ దందా ఆగడం లేదు. రైల్వే, రోడ్డు మార్గాల్లో కిలోల కొద్దీ గంజాయిని కొందరు జిల్లా కేంద్రంతోపాటు తాం డూరు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు తరలిస్తూ యువతను మత్తుకు బలి చేస్తున్నారు. ఒడిశా, కర్ణాటక నుంచి జిల్లా మీదుగా హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
కాగా, గంజాయిని తరలిస్తూ పట్టుబడిన వారి నుంచి దానిని స్వాధీనం చేసుకొని నిందితులపై కేసులు నమో దు చేసి టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్ పోలీసులు చేతులు దులుపుకొంటున్నారే తప్ప.. అస్సలు నిందితులను పట్టుకునే దిశగా విచారణ చేపట్టడంలేదనే విమర్శలున్నాయి. టాస్క్‌ఫోర్స్ బృందా లు కేవలం కల్తీ అల్లం ఫెస్ట్, టీ పౌడర్ వరకే పరిమితమవు తూ.. ఎంతోమంది యువత జీవితాలను నాశనం చేస్తున్న అసలు నిందితులను పసిగట్టడంలో ఘోరంగా విఫలమవుతున్నాయన్న ఆరోపణలున్నాయి.
నామమాత్రంగా తనిఖీలు..
జిల్లాలో గంజాయి దందాను ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కట్టడి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గంజాయి దొరికినప్పుడు మాత్రమే నామమాత్రంగా తనిఖీలు చేస్తుండడంతో అక్రమార్కులు పోలీసుల కళ్లుగప్పి రోడ్డు మార్గంతోపాటు రైళ్లలోనూ గంజాయిని తరలిస్తున్నారు. ప్రధానంగా రైళ్లలో ఒడిశా నుంచి విశాఖ మీదు గా వికారాబాద్, వికారాబాద్ నుంచి ముంబై, పూణె, బెంగళూరుకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది. రైళ్లలో గంజాయి దందా సాగుతున్నా నిత్యం తనిఖీలు చేయకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.
జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే తనిఖీల్లో తక్కువ మేర గంజాయి దొరుకుతుండగా.. రైళ్ల కేంద్రంగా జరుగుతున్న దందాలో మాత్రం వందల కిలోలు సరఫరా జరుగుతున్నట్లు.. స్వాధీనం చేసుకున్న గంజాయిని చూస్తే తెలుస్తున్నది. మరోవైపు కర్ణాటక నుంచి రోడ్డు మార్గంలోనూ ఈ మధ్య పెద్ద ఎత్తున గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం. కేవలం ఎన్నికల సమయంలోనే అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించే జిల్లా పోలీ స్ యంత్రాంగం, మిగతా సమయాల్లో చెక్‌పోస్టులను నామమాత్రంగా మార్చేసిందన్న ఆపవాదూ ఉన్నది. మరోవైపు అమాయకులనే టార్గెట్‌గా చేసుకొని గంజాయి దందాను సాగిస్తున్నారు. అస్సలు నిందితులు ఎవరనేది తెలవకుండా రహస్యంగా గంజాయిని తరలిస్తూ అక్రమంగా ఆర్జిస్తున్నారు.
రిసార్టులపై కొరవడిన నిఘా
వికారాబాద్ జిల్లా కేంద్రం చుట్టూ పదుల సంఖ్యలో రిసార్టులు వెలిశాయి. యువత ను ఆకర్షించేలా వాటి నిర్వాహకులు గం జాయిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. పోటాపోటీగా రిసార్టులు ఏర్పాటు కావడంతో యువతను ఆకర్షించేలా డ్రగ్స్‌ను అమ్ముతున్నట్లు సమాచారం. తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి చుట్టూ పక్కల వెలిసిన రిసార్టులకు వారాంతరాల్లో అధిక మొత్తంలో విద్యార్థులు, యువత వస్తున్నారు. ఇదే అదునుగా రిసార్టుల్లో గంజా యి గుప్పుమంటున్నట్టు తెలుస్తున్నది. రిసార్టుల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లతో పోలీసులు అటువైపు చూడడంలేదనే ఆరోపణలున్నాయి.