బొంరాస్‌పేట, జూలై 26 : అన్నదాతను ఆదుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. రైతు ఏ కారణంచేతనైనా మృతి చెందితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతుబీమా పథకాన్ని 2018లో ప్రవేశపెట్టింది. రైతుపేరు మీద ప్రభుత్వమే ఎల్ఐసీ ప్రీమియం చెల్లించింది.
18 నుంచి 59 ఏండ్లలోపు వయసున్న రైతులు రైతుబీమాలో దరఖాస్తు చేసుకుంటే వారు మృతి చెందిన తర్వాత రూ.5 లక్షల బీమా సాయాన్ని ప్రభుత్వం రైతు నామినీకి ఇచ్చింది. రైతు కుటుంబీకులు బీమా సాయం కోసం వ్యవసాయాధికారులకు దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోనే నామినీ ఖాతాలో డబ్బులు జమయ్యేవి. కానీ నేడు రైతు మృతి చెంది నెల రోజులవుతున్నా బీమా సాయం అందకపోవడం బాధాకరం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1071 మంది రైతులు మృతి చెందితే 955 మంది రైతు కుటుంబాలకు మాత్రమే బీమా సాయం అందింది.
ఇంకా 116 మంది రైతు కుటుంబాలకు బీమా సాయం అందాల్సి ఉన్నది. చనిపోయిన రైతు కుటుంబ సభ్యులు సర్టిఫికెట్, ఒరిజినల్ పట్టా పాసు పుస్తకం వంటి వాటిని వ్యవసాయాధికారులు అదనంగా అడుగుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్‌ను ఆన్లైన్లో పొందాలంటే ఆలస్యమవుతున్నది. వీటి కారణంగానే రైతులకు బీమా సాయం ఆలస్యంగా అందుతున్నది.
కొత్త వారు చేరడానికి ఆగస్టు 5 వరకు అవకాశం..
రైతుబీమా పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది. గతంలోలాగే ఈ పథకంలో కొత్తగా రైతులు చేరడానికి ఆగస్టు 5వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈ ఏడాది జూన్ 28 వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు ఆగస్టు 5వ తేదీలోగా తమ పేర్లను ఏఈవోల వద్ద నమోదు చేసుకోవాలి. 18 నుంచి 59 ఏండ్ల లోపు వయసు ఉండి తమ పేరుమీద భూమి, పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతులందరూ రైతుబీమాకు అర్హులు.
ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నంబరు, పట్టాదారు పాసు పుస్తకం, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్‌లతో పాటు నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని ఏఈవోలకు అందజేస్తే వారు పరిశీలించి రైతుల పేర్లను రైతుబీమా పథకంలో నమోదు చేస్తారు. అదేవిధంగా గతంలో బీమా పథకానికి దరఖాస్తు చేయని రైతులు, నామినీ పేర్లలో మార్పులు చేసుకోవాలనుకునే రైతులు కూడా తగిన ధ్రువీకరణ పత్రాలను ఏఈవోలకు అందజేసి మార్పులు చేసుకోవడానికి, బీమా పథకంలో చేరడానికి అవకాశం కలిగించారు. బీమా పథకంలో నేటి వరకు చేరని రైతులకు వ్యవసాయాధికారులు సమాచారం ఇచ్చి అవగాహన కల్పిస్తున్నా కొంతమంది రైతులు బీమా పథకానికి దరఖాస్తు చేయడం లేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
5798 మంది రైతులకు రూ.289.90 కోట్ల బీమా సాయం..
రైతుబీమా పథకం 2018లో ప్రారంభమైంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి వికారాబాద్ జిల్లాలో 5798 మంది రైతులకు రూ.5 లక్షల చొప్పున రూ.289.90 కోట్ల బీమా సహాయాన్ని ప్రభుత్వం అందజేసింది.