రంగారెడ్డి, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డిజిల్లా పరిధిలో ప్రధాన రహదారుల్లో ప్రమాదకర మలుపులు ప్రాణాలు తీస్తున్నాయి. ఏ రోడ్డు చూసినా అడుగడుగునా గోతులు.. ఆమడకో మలుపు అన్న చందంగా మారాయి. ఇటీవల వర్షాలకు ప్రధాన రోడ్లల్లో నీరు నిలిచి పెద్దఎత్తున గోతులు ఏర్పడి ప్రయాణాలకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. మరమ్మతులు చేయాలని ప్రజలు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నది.
ప్రమాదకర మలుపుల వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతూ.. అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది అంగవైకల్యానికి గురై మంచానికే పరిమితమవుతున్నారు. ఈ ప్రమాదాలకు పాలకులే కారణమని, ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. అయినప్పటికీ పాలకులు మాత్రం పట్టించుకోవడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఏ ఒక్క రోడ్డు మరమ్మతును చేపట్టలేదని ఆరోపణలొస్తున్నాయి.
రోడ్ల మరమ్మతుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైనప్పటికీ మరమ్మతులు చేయడంలేదని, మూలమలుపులను కూడా పట్టించుకోవటంలేదని ప్రజలు వాపోతున్నారు. రోడ్ల మరమ్మత్తులపై ప్రజాప్రతినిధులు సైతం పొంతలేని ప్రకటనలు చేస్తున్నారు. రోడ్డుపై గుంతలుంటేనే ప్రమాదాలు జరగవని ఓ బాధ్యతగల ఎంపీ మాట్లాడుతుండటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రోడ్ల విస్తరణపై ఉన్న న్యాయపరమైన చిక్కులను కూడా పరిష్కరించే పరిస్థితిలో పాలకులు లేకపోవడంపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూలమలుపు వద్ద ఉన్న గోతిని తప్పించబోయి జరిగిన ప్రమాదంలో 19 మంది మృత్యువాతకు గురయ్యారు. ఇటీవల జరిగిన అనేక ప్రమాదాలు కూడా మూలమలుపుల వద్దనే జరిగాయి.
రంగారెడ్డిజిల్లా పరిధిలో ఐదు ప్రధాన రహదారులున్నాయి. వీటిలో హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారి మాల్ వరకు, హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి షాద్‌నగర్ వరకు, విజయవాడ-హైదరాబాద్ ప్రధాన రహదారి బాటసింగారం వరకు, హైదరాబాద్-బీజాపూర్ రహదారి మన్నెగూడ వరకు జిల్లా పరిధిలో విస్తరించి ఉన్నాయి. ప్రధాన రహదారుల్లో అనేక మలుపులు, గుంతలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ బీజాపూర్ ప్రధాన రహదారిలో మన్నెగూడ వరకు 46 కిలోమీటర్లు ఉండగా, ఈ రోడ్డుపై సుమారు 50 వరకు మృత్యు మలుపులున్నాయి. వీటిలో మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్, చిన్నషాపూర్, కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, చేవెళ్ల మండలంలో ముడిమ్యాల, కందవాడ, మల్కాపూర్, దామరగిద్ద, మీర్జాగూడ, ఆలూరు, అంతారం ప్రాంతాల్లో ప్రమాదకర మలుపులున్నాయి.
అప్పా నుంచి మన్నెగూడ వరకు కూడా మలుపులున్నాయి. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై మహేశ్వరం గేటు, రాచులూరు, దెబ్బగూడ, కడ్తాల్ మండలంలోని కడ్తాల్, మైసిగండి, ఆమనగల్లు మండలంలోని విఠాయిపల్లి, పల్గుతండా తదితర ప్రాంతాల్లో ప్రమాదకర మలుపులున్నాయి. హైదరాబాద్-బెంగళూరు రహదారిలో పాలమాకుల, దర్గా ఎక్స్‌రోడ్డు, షాద్‌నగర్, నందిగామ, కేశంపేట చౌరస్తాల్లో ప్రమాదకర మలుపులున్నాయి. విజయవాడ-హైదరాబాద్ ప్రధాన రహదారిలో బాటసింగారం, పెద్దఅంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో కూడా ప్రమాదకర మలుపులుండటంతో పాటు మరమ్మతుల పేరుతో గోతులు తీయడంతో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. వీటికి వెంటనే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లా పరిధిలో ఉన్న ప్రధాన రహదారులు డబుల్ రోడ్లకే పరిమితమయ్యాయి. మరికొన్ని రోడ్లు సింగిల్ రోడ్డుగానే ఉన్నాయి. వాహనాల రద్దీ పెరిగినప్పటికీ రోడ్లను విస్తరించడానికి ప్రభుత్వం ముందుకు రావడంలేదు. హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారి ఇబ్రహీంపట్నం వరకే నాలుగు లైన్లుగా విస్తరించారు. ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు నాలుగు లైన్లుగా విస్తరించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాని, ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ రహదారిపై పలు ఇంజినీరింగ్ కళాశాలలుండటంతో వాహనాల సంఖ్య విశేషంగా పెరిగాయి. నిత్యం ఈ రహదారిపై వాహనాల సంఖ్య పెరిగి విస్తరణకు నోచుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. శ్రీశైలం-హైదరాబాద్, హైదరాబాద్-బీజాపూర్ రోడ్లు కూడా విస్తరణకు నోచుకోవడంలేదు.