సీజన్లకు సీజన్లు గడిచిపోతున్నాయి. కానీ.. రంగారెడ్డి జిల్లాలో మిల్లర్ల నుంచి కస్టమ్స్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) మాత్రం వెనక్కి రావడంలేదు. సీఎంఆర్ ఇవ్వడంలో మిల్లర్లు నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను సైతం ఖాతరు చేయడంలేదు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ మిల్లర్లు మొండికేస్తున్నారు. జూన్ 30 నాటికే లక్ష్యం పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ మిల్లర్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం గడువును మరో 90 రోజులకు పొడిగించింది. అది కూడా గత సెప్టెంబర్ 30తో ముగిసింది. 2022-23 నుంచి వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి ఇవ్వాల్సిన సుమారు 16,600 మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అధికారులు నోటీసులతోనే సరిపెడుతుండడంతో మిల్లర్లు అలసత్వం వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
– రంగారెడ్డి, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ)
ప్రతీ సంవత్సరం ఇదే తంతు..
పౌర సరఫరాల సంస్థ నిబంధనల మేరకు ప్రతీ సంవత్సరం సీజన్‌కు సంబంధించి ఆరు నెలల్లో మిల్లులకు కేటాయించిన ధాన్యానికి బియ్యం సేకరణ చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది రైస్ మిల్లర్ల తీరు వల్ల ప్రతి సీజన్లోనూ సీఎంఆర్ ప్రక్రియలో జాప్యం జరుగుతూనే ఉన్నది. 2022-23 సీజన్‌కు సంబంధించిన ధాన్యాన్ని సైతం మరాడించడంలో మిల్లర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ సీజన్‌కు సంబంధించి 9వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉన్నది. అలాగే.. 2023-24 యాసంగి, వానకాలానికి సంబంధించి 13 రా రైస్ మిల్లులకు, 5 బాయిల్డ్ మిల్లులకు ప్రభుత్వం ధాన్యాన్ని అప్పగించింది.
ఇందులో వానకాలం సాగుకు సంబంధించి 582.443 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు. యాసంగికి సంబంధించి 7,101.521 (54 శాతం) బియ్యం మిల్లర్ల వద్దే ఉన్నది. సీఎంఆర్‌పై కేంద్రం ఇప్పటివరకు అనేకమార్లు గడువు పొడిగిస్తూ వచ్చింది. చివరగా.. గత సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. మిల్లర్లతో తరచూ సమావేశాలు నిర్వహించడంతోపాటు పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లుల్లో తనిఖీలు జరిపి ఒత్తిడి తెచ్చినప్పటికీ ఫలితం రావడంలేదు. మరోసారి కేంద్రం గడువు పెంచుతుందేమోనన్న ఆశలో మిల్లర్లు ఉన్నారు.
బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడంతోనే..
ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చుకుని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడంతోనే మిల్లర్ల వద్ద సీఎంఆర్ బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తున్నది. ఎఫ్‌సీఐకి అందజేయాల్సిన ఒక సీజన్‌లోని బియ్యాన్ని వాయిదా వేస్తూ మరొక సీజన్లో వచ్చే ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇస్తున్నారు. అధికారులు ఒత్తిడి చేసిన సందర్భంలో కొందరు మిల్లర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలించే రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సర్దుబాటు చేస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. కడ్తాల్ మండలం మక్తమాదారం గ్రామంలోని ఓ రా రైస్ మిల్లు యజమాని 2021-22 సంవత్సరానికి సంబంధించిన 241 టన్నుల సీఎంఆర్ రైస్‌ను ప్రభుత్వానికి అప్పగించడంలో నిర్లక్ష్యాన్ని కనబరుస్తూ వస్తున్నారు.
దీనిపై పలుమార్లు నోటీసులు ఇచ్చిన అధికారులు ఆర్ఆర్ యాక్ట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ప్రస్తుత వానకాలం పంటలకు సంబంధించి కొన్ని చోట్ల వరి కోతలు మొదలయ్యాయి. ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. దొడ్డు రకాలతో పాటుగా తొలిసారిగా సన్న రకాలను వేర్వేరుగా కొనుగోలు చేయనున్నారు. ఈ సీజన్లో కొనుగోలు కేంద్రాల ద్వారా 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌరసరఫరాల శాఖ సంకల్పిస్తున్నది. గత సీజన్లకు సంబంధించిన బియ్యమే మిల్లర్ల వద్ద పెండింగ్‌లో ఉండడంతో ప్రస్తుత వానకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించే విషయంలో ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నది. బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే సదరు మిల్లులకు ధాన్యాన్ని కేటాయించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.