రంగారెడ్డి, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఓ వైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నది. జిల్లాలో భూగర్భజలాలు అడుగంటడంతో వేలాది ఎకరాల్లోని వరి పంట ఎండిపోతున్నది. ఆ పంటను కాపాడుకునేందుకు అన్నదాత అప్పులు చేసి బోర్లను తవ్విస్తూ శాయశక్తులా ప్రయత్నిస్తుంటే.. అకాల, వడగండ్ల వానలు రైతన్నను మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి.
శుక్ర, శనివారాల్లో కురిసిన వడగండ్లు, అకాల వానతో కడ్తాల్, తలకొండపల్లి, శంకర్పల్లి, షాబాద్, చేవెళ్ల మండలాల్లోని వరి, ఇతర పంటలకు తీవ్ర నష్టం కలిగింది. సుమారు ఆరు నుంచి ఏడు వేల ఎకరాల వరకు పంటలు నష్టపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పంటలు ఎండిపోతున్నా.. అకాల వర్షాలతో నష్టపోతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం అన్నదాత వైపు కన్నెత్తి చూడడంలేదు.
15,000 ఎకరాల్లో పంట నష్టం
జిల్లాలోని మంచాల, యాచారం, మాడ్గుల, ఆమనగల్లు, షాద్నగర్, కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, చౌదరిగూడ, షాబాద్ వంటి మండలాల్లో భూగర్భజలాలు అడుగంటి.. సరిపడా నీరు అందక వరి, మొక్కజొన్న, ఉల్లిగడ్డ, మిర్చి తదితర పంటలు పెద్దఎత్తున ఎండిపోయాయి. జిల్లాలో 93,000 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేయగా.. సుమారు 15,000 ఎకరాల వరకు ఎండిపోయినట్లు సమాచారం.
ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు అప్పులు చేసి కొత్త బోర్లను తవ్వించడంతో పాటు ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నారు. తీరా.. చేతికందే సమయంలో అతివృష్టితో తీవ్ర నష్టం కలిగింది. అలాగే, జిల్లాలో 13,800 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైంది. మొక్కజొన్న కంకులు వేసే సమయంలో నీరందక ఎండిపోయింది. షాద్నగర్ నియోజకవర్గంలోని కేశంపేట, కొందుర్గు, కడ్తాల్ వంటి ప్రాంతాల్లో రైతులు అధికంగా నష్టపోయారు.
అలాగే, మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాల్లో వేసిన మిర్చి పంట కూడా నీరందక ఎండిపోతున్నది. వర్షాల్లేక ఎండిపోయిన పంటలను అధికారులు పరిశీలించి..ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. అదేవిధంగా జిల్లాలో వరి పంట చేతికందే సమయంలో శుక్ర, శనివారాల్లో కురిసిన అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. గాలి, వడగండ్ల వానకు పంట నేలపై వాలింది. వరి, మామిడి తోటలు, ఇతర కూరగాయల పంటలకు తీవ్రంగా నష్టం కలిగింది.
ప్రభుత్వం ఆదుకోవాలి
– నర్సింహ, రైతు
ఆరుగాలం శ్రమించిన పంట చేతికందే సమయంలో వానలు పడడంతో వరి, మొక్కజొన్న, మిర్చి, ఉల్లిగడ్డ, కూరగాయల పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. అప్పులు చేసి పంటను సాగు చేస్తే.. పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొన్నది. దీంతో తీసుకొచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడంలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలి.