మొయినాబాద్, మే 15 : వరి సాగులో రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుందని పీజేటీఎస్ఏయూ శాస్త్రవేత్త డాక్టర్ మహాదేవప్ప, డాక్టర్ రమేశ్ అన్నారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖలు సంయుక్తంగా చేపట్టిన రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో భాగంగా గురువారం మండల పరిధిలోని చిలుకూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలను స్వీకరించి యాజమాన్య పద్ధతులను పాటించాలని చెప్పారు. తక్కువ రసాయనాలను వినియోగించి అధిక దిగుబడులను సాధించి నేల సారవంతాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధానాన్ని అవలంబించాలని సూచించారు. పంటకు ముందు పచ్చి రొట్టను సాగు చేసి కలియదున్నుతే నేలలో సారవంతం పెరుగుతుందని, పంట దిగుబడులు కూడా వస్తుందన్నారు.
భూమిలో ఒకే రకమైన పంటను సాగు చేయకుండా పంట మార్పిడిని పాటించాలని సూచించారు. మార్కెట్లో విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా రశీదును పొందాలన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసుకుంటే రైతులు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఏడీఏ బీజే సురేశ్‌బాబు, మండల వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, ఉద్యానవన శాఖ అధికారి కీర్తికృష్ణ, ఏఈవో సునీల్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.
సేంద్రియ వ్యవసాయంతో అధిక దిగుబడులు
ఆమనగల్లు : రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడులు పొందవచ్చునని వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్మల, సుజాత తెలిపారు. గురువారం ఆమనగల్లు మండల పరిధిలోని కోనాపూర్‌లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. మార్కెట్‌కు అనుగుణంగా పంటలు పండించాలని, రసాయనాలు, క్రిమిసంహాకారాలు ఎక్కువ వాడవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ శోభారాణి, మండల వ్యవసాయ అధికారిణి అరుణకుమారి, విస్తరణ అధికారి మీనాక్షి, స్వప్నశ్రీ, తరుణ్ పాల్గొన్నారు.
శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు
మాడ్గుల : మండల పరిధిలోని నాగిళ్ల గ్రామంలో రైతు వేదిక భవనంలో గురువారం మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ మురళి, డాక్టర్ ప్రవీణ్ హాజరై, శాస్త్రవేత్తలు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని సూచనలు ఇచ్చారు. పంటల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై వివరించారు. కార్యక్రమంలోని వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి రాజేశ్‌నాయక్, ప్రియాంక, భార్గవి, జ్యోత్స్న పాల్గొన్నారు.