
వికారాబాద్ : గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట మండలం ఎల్లకొండ గ్రామానికి చెందిన శివశంకర్ (30) గత 9 సంవత్సరాల క్రితం సదాశివపేటకు చెందిన శివానీతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివశంకర్ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. నవాబుపేట మండలం మైతాబ్ఖాన్ గూడ గ్రామ సమీపంలోని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో శివశంకర్‌పై దాడి చేశారు.
దీంతో శివశంకర్‌కు తలకు, చెవులకు, ముక్కు, నోటికి తీవ్ర గాయాలు కావడంతో రక్తం వచ్చింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి అక్క సునంద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.