John Wesley | మొయినాబాద్ : రామరాజ్య ముసుగులో ఆలయ అర్చకులపై దాడులు చేయడం అప్రజాస్వామికమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడిని ఖండించారు. రంగరాజన్‌ను ఆయన నివాసంలో మంగళవారం సీపీఎం నేతలు పరామర్శించారు. దాడికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం జాన్ వెస్లీ మాట్లాడుతూ.. రామరాజ్యం ముసుగులో రౌడీ మూకల దాడి చేయడం సరికాదన్నారు.
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన బాలాజీ ఆలయ అతి ప్రసిద్ధమైందన్నారు. ఆలయ అభివృద్ధి కోసం రంగరాజన్ ఎంతో కృషి చేశారన్నారు. రంగరాజన్ లౌకికవాది, ప్రజాస్వామ్యవాది, పరమత సహనం కలిగిన వ్యక్తి అని.. ఆయనపై మతోన్మాదులు దాడి చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ముఖ్యంగా రంగరాజన్‌పై దాడికి పాల్పడిన వ్యక్తులపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మూడునెల్లలో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ అర్చకులపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, మతోన్మాదం పేరుతో దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు.
రంగరాజన్‌ను కలిసిన వారిలో సీపీఎం రాష్ట్ర నాయకులు డీజీ నరసింహారావు, హిమబిందు, శ్రీరామ్ నాయక్, ఆశయ్య, కోట రమేశ్, సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్, సామెల్, జగదీశ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీపీఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్, సీపీఎం మొయినాబాద్ మండల కన్వీనర్ సీహెచ్ ప్రవీణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, అరుణ్ కుమార్, తేజ, సీపీఎం మొయినాబాద్ మండల నాయకులు ప్రభుదాస్, రత్నం, శ్రీనివాస్ మొయినాబాద్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి శేఖర్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సంజీవ, సందీప్, అంజి, శ్రీశైలం, రాజేందర్ ఉన్నారు.