పెద్దఅంబర్‌పేట, జూన్ 19: మున్సిపాలిటీ పరిధి కుంట్లూరులోని భూదాన్ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలకు న్యాయం చేయాలని సీపీఐ నాయకులు కోరారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర నాయకులు ఆందోజు రవీంద్రాచారి, పాలమాకుల జంగయ్య, ముత్యాల యాదిరెడ్డి, పానుగంటి పర్వతాలు తదితరులు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కుంట్లూరు రెవెన్యూ పరిధి 215 నుంచి 224 సర్వేనంబర్ వరకు ఉన్న భూదాన్ భూమిలో 18 నెలలుగా దాదాపు 20 వేలమంది నిరుపేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని తెలిపారు.
పిల్లాపాపలు అరకొర వసతులతో అక్కడే ఉంటున్నారని, పక్కనున్న ప్రభుత్వ పాఠశాలకు వారి పిల్లలను పంపుతున్నారని చెప్పారు. కొందరు భూస్వాములు, రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ భూదాన్ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నాయని, వారినుంచి భూమిని కాపాడి అర్హులైన నిరుపేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. గృహలక్ష్మి పథకంలో ఇండ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని విన్నవించారు. ఈ భూమికి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా సాయం అందించాలని కోరారు. తమ విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారని, రెవెన్యూ మంత్రి, అధికారులతో మాట్లాడి నివేదికను తెప్పించుకుంటానని చెప్పినట్టు తెలిపారు. అర్హులైన పేదలకు న్యాయం చేద్దామని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు.