జిల్లాలో పత్తి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్తి విక్రయించే సమయంలో ఏదో ఒక కొర్రీలు పెట్టిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) డబ్బులు చెల్లించడంలోనూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది. ఐదారు రోజుల్లోగా పత్తిని విక్రయించిన రైతులకు చెల్లింపులు పూర్తి చేస్తామంటూ సీసీఐ అధికారులు చెబుతున్నప్పటికీ రెండు నెలలు దాటినా డబ్బులు చేతికి అందక రైతులు కష్టాలు పడుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే డబ్బులు జమ కావడంలో జాప్యం జరుగుతున్నట్లు మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు.
కొందరు రైతుల ఆధార్ బ్యాంకు ఖాతాలకు లింక్ కాకపోవడం, ఆధార్ మ్యాపింగ్ లేపోవడం తదితర కారణాలతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు జిల్లాలో ఇప్పటివరకు రూ.932 కోట్ల విలువైన పత్తిని సేకరించగా, ఇప్పటివరకు రూ.292 కోట్ల చెల్లింపులను మాత్రమే సీసీఐ జమ చేసింది. రూ.640 కోట్ల బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి.
గత రెండు నెలల నుంచి ఈ నెల 10 వరకు పత్తిని విక్రయించిన 54 వేల మంది రైతులకుగాను సుమారు 10 వేల మంది రైతులకు మాత్రమే రూ.292 కోట్లు చెల్లించారు. ఇప్పటికే పలు పత్తి కొనుగోలు కేంద్రాలను మూసివేసిన సీసీఐ అధికారులు, ఈ నెలాఖరులోగా మిగతా కొనుగోలు కేంద్రాలను మూసివేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో ఈ ఏడాది 2.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, 2 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానున్నదని అధికారులు అంచనా వేశారు.
– వికారాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ)
జిల్లావ్యాప్తంగా 14 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాండూరులో మారుతీ, శుభం, బాలాజీ కొనుగోలు కేంద్రాలు, కోట్పల్లిలో సాయిబాబా కాటన్ అగ్రో ఇండస్ట్రీస్, పరిగిలో లక్ష్మీ వేంకటేశ్వర, నరసింహ, రాకంచర్ల కాటన్మిల్, వికారాబాద్లో ధరణి, సాయిబాబా, అయ్యప్ప జిన్నింగ్ మిల్లు, మర్పల్లిలో శ్రీఅయ్యప్ప కాటన్ ట్రేడర్స్, కొడంగల్లో విజయ్ ఇండస్ట్రీస్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 2 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి వస్తుందని అధికారులు అంచనా వేయగా, ఇప్పటివరకు 1.25 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని 54 వేల మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. అంచనాలకు తగినట్లుగా కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. పత్తిని విక్రయించిన రైతులు డబ్బుల కోసం సీసీఐ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండు నెలలు దాటినా డబ్బులు రావడం లేదని కొందరు రైతులు ప్రైవేటు మార్కెట్లోనే విక్రయిస్తున్నారు.
బహిరంగ మార్కెట్లో రూ.100 తక్కువ వస్తున్నా.. వెంటనే డబ్బులు చేతికొస్తుండడంతో కొందరు రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మేందుకు మొగ్గుచూపుతున్నారు. జిల్లావ్యాప్తంగా 14 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇప్పటికే 8 కొనుగోలు కేంద్రాలను అధికారులు మూసివేశారు. వికారాబాద్, కోట్పల్లి, ధారూరులోని కాటన్ మిల్లులో పత్తి కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నది. మొదట క్వింటాలుకు రూ.7521లకు పత్తిని సేకరించగా, ప్రస్తుతం రూ.7421లకు కొనుగోలు చేస్తున్నారు.
పత్తిని విక్రయించిన రైతులకు త్వరగా చెల్లింపులు పూర్తయ్యేలా సీసీఐ అధికారులకు సూచిస్తాం. బిల్లులు, ఆధార్ మ్యాపింగ్ లేకపోవడం బ్యాంకు లింకేజీ సమస్యలతో చెల్లింపులు జాప్యం జరుగుతున్నది. ఆయా కారణాలతో వెనక్కి వస్తున్న బిల్లులకు సంబంధించి మళ్లీ బిల్లులు చేసి సీసీఐకి పంపిస్తున్నాం.
– సారంగపాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి