ఎస్సీ హాస్టళ్లలో వసతులను మెరుగుపర్చుతున్న సర్కార్
వికారాబాద్ జిల్లాలో జోరుగా సాగుతున్న పనులు
రూ.79.37 లక్షలతో 18 హాస్టళ్లలో సౌకర్యాల కల్పన
ప్రధానంగా శానిటేషన్, విద్యుత్, తాగునీటి వసతులపై దృష్టి
ఈ నెలాఖరు వరకు పనులు పూర్తి చేసే దిశగా అధికారుల చర్యలు
పరిగి, మార్చి 18 :విద్యారంగం అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తుండగా.. ప్రభుత్వ హాస్టళ్లలోనూ సకల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. వికారాబాద్ జిల్లాలోని 18 ఎస్సీ హాస్టళ్లలో వసతులను మెరుగుపర్చేందుకు క్రూషియల్ వెల్ఫేర్ ఫండ్ కింద రూ.79.37లక్షలు అందించగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నిధులను ముఖ్యంగా పారిశుధ్యం, విద్యుత్, తాగునీటి వసతుల కల్పనకు వినియోగిస్తున్నారు. దీనిలో భాగంగా కరెంట్ వైర్లు మార్చడం, పాడైన స్విచ్‌బోర్డులు, ఫ్యాన్లు బాగు చేయడం, మరుగుదొడ్లు, తాగునీటి పైపులైన్లు, నీటి ట్యాంకులకు మరమ్మతులు వంటివి చేపడుతున్నారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తయ్యేలా అధికారులు చొరవ తీసుకుంటున్నారు.
విద్యారంగం అభివృద్ధికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తున్నది. దీనిలో భాగంగా ఎస్సీ హాస్టళ్లను బాగు చేసేందుకు సర్కారు సంకల్పించింది. ఇందుకుగాను ప్రత్యేకంగా క్రూషియల్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా నిధులు మంజూరు చేసింది. వికారాబాద్ జిల్లాకు క్రూషియల్ వెల్ఫేర్ ఫండ్ కింద రూ.79.37లక్షలు కేటాయించింది. ఈ నిధులతో ఎస్సీ హాస్టళ్లలో మరమ్మతులు, ఇతర సదుపాయాలు చేపడుతున్నారు. జిల్లా పరిధిలో పలు హాస్టళ్లలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా సర్కారు బడుల్లో అన్ని వసతుల కల్పనకు ప్రభుత్వం నిర్ణయించి మొదటి విడుతలో అమలు చేయబోయే పాఠశాలలు ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేసింది. సదరు బడుల్లో ఏ పనులు చేపట్టాలి, ఎంత ఖర్చవుతుందనే అంచనాల తయారీలో అధికారులు తలమునకలై ఉన్నారు.
18 ఎస్సీ హాస్టళ్లలో కొనసాగుతున్న పనులు..
వికారాబాద్ జిల్లా పరిధిలో 18 ఎస్సీ హాస్టళ్లలో క్రూషియల్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 25 ఎస్సీ హాస్టళ్లు ఉండగా.. అందులో 7 బాలికల హాస్టళ్లు ఉన్నాయి. ఈ హాస్టళ్లలో సుమారు 1500 మంది విద్యార్థులు ఉంటూ చదువులు కొనసాగిస్తున్నారు. దీనిలో ఒకటి అద్దె భవనం కాగా, మిగతా 24 భవనాలకు గాను 18 భవనాల్లో మరమ్మతులు అవసరమని నిర్ణయించారు. ఇందుకుగాను క్రూషియల్ వెల్ఫేర్ ఫండ్ రూ.79.37లక్షలు వెచ్చించి పనులు కొనసాగిస్తున్నారు. ఈ నిధులతో ప్రధానంగా ఎస్సీ హాస్టళ్లలో ఎలక్ట్రికల్, శానిటేషన్, తాగునీటి సదుపాయం తదితర పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న భవనాల్లో విద్యుత్ వైరింగ్ పాడైతే వెంటనే కొత్త వైరింగ్, ఇతర స్విచ్‌బోర్డులు, ఫ్యాన్లు అమర్చడం వంటివి చేస్తున్నారు. శానిటేషన్‌లో భాగంగా మరుగుదొడ్ల మరమ్మతులు, ఇతర పనులు కొనసాగుతున్నాయి.
నిధులు మిగిలితే రంగులు వేయడం సైతం వంటి పనులు పనులు చేపడుతున్నారు. దీంతోపాటు ప్రతి హాస్టల్లో తాగునీటి వసతిని మెరుగుపరుస్తున్నారు. బోర్లు ఉన్నట్లయితే వాటి మరమ్మతు పనులు, ఇతర పైప్‌లైన్ పనులు చేస్తున్నారు. దీంతోపాటు ప్రతి హాస్టల్‌కు మిషన్ భగీరథ నీటి కనెక్షన్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఏదైనా ఇబ్బంది కలిగి కరెంటు లేని సమయంలోనూ నీటికి ఇబ్బంది కలుగకుండా నీరు అందుబాటులో ఉండేలా మిషన్ భగీరథ కనెక్షన్ ఉపయోగపడనున్నది. కొన్ని హాస్టళ్లలో పాత వాటర్ ట్యాంకులు పాడైతే వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు.
పనుల పర్యవేక్షణ టీఎస్డబ్ల్యూఐడీసీకి..
జిల్లా పరిధిలోని ఎస్సీ హాస్టళ్లలో మరమ్మతు పనులు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. క్రూషియల్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా నిధులు కేటాయించగా, పనుల పర్యవేక్షణ బాధ్యతను టీఎస్ఈడబ్ల్యూఐడీసీ వారికి అప్పగించారు. పనులకు సంబంధించిన పాలనాపరమైన అనుమతులు ఎస్సీ అభివృద్ధి శాఖ వారు ఇవ్వగా, పనులు పూర్తయిన తర్వాత పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ద్వారా బిల్లులు మంజూరు చేస్తారు. ఇప్పటికే జిల్లాలోని నాలుగైదు హాస్టళ్లలో మరమ్మతు పనులు చేపట్టి పూర్తి చేశారు. మిగతా పనులు ఈ నెలాఖరులోపు పూర్తి చేసేలా ఎస్సీ అభివృద్ధి శాఖ జిల్లా అధికారులతోపాటు ఇంజినీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పనుల పురోగతి తెలుసుకుంటూ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నెలాఖరులోగా పనులు పూర్తి
జిల్లా పరిధిలో 25 ఎస్సీ హాస్టళ్లుండగా 18 హాస్టళ్లలో మరమ్మతు పనుల కోసం రూ.79.37లక్షలు కేటాయించాం. ఆయా హాస్టళ్లలో ప్రధానంగా తాగునీరు, ఎలక్ట్రికల్, శానిటేషన్ పనులు, ఇతర మరమ్మతుల కోసం ఈ నిధులు వెచ్చించడం జరుగుతుంది. కొన్ని హాస్టళ్లలో ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. మిగతా హాస్టళ్లలో మార్చి నెలాఖరు లోపు పనులు పూర్తయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. మరమ్మతు పనులు పూర్తయితే ఎస్సీ హాస్టళ్లలో సదుపాయాలు మరింత మెరుగవుతాయి.
– మల్లేశం, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి, వికారాబాద్ జిల్లా