ఉమ్మడిజిల్లావ్యాప్తంగా జోరుగా సాగుతున్న పనులు
రంగారెడ్డి జిల్లాలో 723 రోడ్లకు రూ.41 కోట్లు మంజూరు
వికారాబాద్ జిల్లాలో రూ.24.86 కోట్లతో 594 సీసీ రోడ్లు..
ఇప్పటికే 90 రోడ్ల పనులు పూర్తి
మార్చిలోగా మిగిలినవి పూర్తి చేసేందుకు అధికారుల చర్యలు
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ఇబ్రహీంపట్నంరూరల్, ఫిబ్రవరి 28 : గ్రామీణ రోడ్లను మెరుగుపరిచే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తున్నది. గల్లీగల్లీకి సీసీరోడ్డు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నది. దీనికోసం పెద్ద ఎత్తున నిధులను వినియోగిస్తున్నది. ప్రభుత్వం నుంచి ఇప్పటికే నిధులు మంజూరుకాగా ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా రోడ్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 723 రోడ్లకుగాను రూ.41కోట్లు మంజూరు కాగా పనులు గంగా సాగుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో రూ.24.86 కోట్లతో 594 సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 90 రోడ్ల నిర్మాణం పూర్తి కాగా.. 310 రోడ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మిగతా 194 రోడ్ల పనులను త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామాల అభివృద్ధికి సర్కారు పెద్ద పీట వేస్తున్నది. ప్రతి నెలా గ్రామపంచాయతీలకు నిధులు అందిస్తూ మౌలిక వసతులు కల్పిస్తున్నది. అంతేకాకుండా ఎన్ఆర్ఈజీఎస్ కింద గ్రామాలకు అదనంగా నిధులు మంజూరు చేసి సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 594 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.24.86 కోట్లు మంజూరు చేసింది. ఆయా నియోజకవర్గాల్లో మండలాలవారీగా నిధులు అందించి పనులు చేపడుతున్నది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 90 సీసీ రోడ్ల నిర్మాణం పూర్తికాగా.. మరో 310రోడ్ల పనులు వివిధ దశల్లో జోరుగా సాగుతున్నాయి. పనుల్లో అవకతవకలు జరుగకుండా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు పర్యవేక్షణ చేపడుతున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగుపడనున్నది. మట్టి, శిథిలావస్థకు చేరిన రోడ్లను పునరుద్ధరిస్తుండడంతో ప్రజల ఇక్కట్లు తీరనున్నాయి. గిరిజనతండాల్లో సైతం సీసీ రోడ్ల నిర్మాణం కొనసాగుతున్నది.
మార్చిలోగా పనుల పూర్తికి చర్యలు…
సీసీ రోడ్ల నిర్మాణ పనులను మార్చి నెలాఖరులోపు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 399 రోడ్ల పనులకు సంబంధించి ఇప్పటికే అవసరమైన మెటీరియల్ తెచ్చిపెట్టారు. ఇందులో 310 రోడ్ల పనులు ఊపందుకోగా.. మరో 194 రోడ్ల పనులు ప్రారంభం కావాల్సి ఉన్నది. వీటిని సైతం సాధ్యమైనంత త్వరగా పనులు చేపట్టేలా పంచాయతీరాజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇవేకాకుండా ఎన్ఆర్ఈజీఎస్ కింద మరిన్ని పనులు సైతం మంజూరు కానున్నట్లు సమాచారం. రాబోయే నాలుగైదు రోజులలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలుబడనున్నట్లు తెలిసింది.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు సీసీరోడ్లు, భూగర్భడ్రైనేజీల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. అదే మాదిరిగా ఈ ఏడాది కూడా మిగిలిపోయిన సీసీరోడ్లను పూర్తిచేసేందుకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో 723 సీసీరోడ్ల నిర్మాణానికి గాను ఉపాధి హామీ కింది రూ.41కోట్లు మంజూరయ్యాయి. దీంతో పలు గ్రామాల్లో ఇప్పటికే పనులు ప్రారంభంకాగా పనులు ఊపందుకున్నాయి. స్వ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో పల్లెలు అభివృద్ధి పథంలో ఉరకలు వేస్తున్నాయి. గతంలో దయనీయంగా ఉన్న గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం చొరవతో అందంగా ముస్తాబవుతున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమంతో ప్రతిపల్లె పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నది. జీపీలకు ప్రభుత్వం నెలనెలా నిధులు మంజూరు చేస్తూ అండర్ డ్రైనేజీలు, సీసీరోడ్లు తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నది. సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద ఎత్తున సీసీరోడ్ల నిర్మాణం..
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సీసీరోడ్లు నిర్మించబడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల్లో రోడ్లులేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. ఉపాధిహామీ పథకం కింద ప్రభుత్వం కేటాయించిన నిధులతో ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం అత్యధిక నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
-ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఇబ్రహీంపట్నం