గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బీమా పథకాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీమా ప్రీమియం చెల్లింపునకు నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో బీమా పథకంలో చేరిన రైతులకు ఆటోమెటిక్‌గా రెన్యువల్ కానుండగా.. కొత్తగా పాసుపుస్తకాలు జారీ అయినవారికి, గతంలో అర్హత ఉండి దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది. 18-59 ఏండ్ల వయసు గల రైతులకు వర్తింపజేస్తున్న ఈ పథకంతో రంగారెడ్డి జిల్లాలో 3,22,861 మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నది.
-రంగారెడ్డి, జూలై 27(నమస్తే తెలంగాణ)
గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు కొండంత ధీమాను కల్పించింది. దురదృష్టవశాత్తు ఇంటి పెద్ద అయిన రైతు మృతి చెందితే అతని కుటుంబం వీధినపడకుండా ఉండేలా రైతు బీమా పథకాన్ని కేసీఆర్ తీసుకువచ్చారు. 18 నుంచి 59 ఏండ్ల్ల వయసు ఉన్న ప్రతి రైతుకూ బీమా వర్తిస్తున్నది. రైతు మృతి చెందితే ఆ కుటుంబానికి 10 రోజుల్లోనే బీమా సొమ్ము రూ.5 లక్షలు ఆ రైతు కుటుంబం ఖాతాలో జమ అవుతాయి. ప్రభుత్వమే రైతుకు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రీమియం చెల్లిస్తున్నది. గత ఏడాది 1,97,216 మంది రైతులు బీమాలో నమోదుకాగా.. వారందరికీ ఆటోమెటిక్‌గా ఈ నెల 30వ తేదీ వరకు రెన్యూవల్ చేయనున్నది. ఒకవేళ నామినీ పేరును సరి చేసుకోవాలనుకుంటే.. అందుకు కూడా ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది.
కొత్త పాసుపుస్తకం దారులకు అవకాశం..
ఈ ఏడాది భూముల క్రయి, విక్రయాల ద్వారా కొత్తగా జారీ అయిన పాసుపుస్తకాలకు సంబంధించిన రైతులకు కూడా రైతు బీమాను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా.. కొత్తగా పాసుపుస్తకాలు జారీ అయిన రైతులు రంగారెడ్డి జిల్లాలో 23,682 మంది వరకు ఉన్నారు. వీరంతో ఆగస్టు 5వ తేదీ లోపుగా బీమాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
వ్యవసాయ శాఖ కార్యాలయాలకు వెళ్లి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అందజేస్తే అధికారులు ఆయా రైతుల పేర్లను బీమా పథకంలో నమోదు చేస్తారు. వీరితోపాటు 5 ఎకరాలలోపు, 5 ఎకరాలకు మించి ఉన్న రైతులు గతం నుంచీ వివిధ కారణాలతో బీమా పథకానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయా రైతులను సైతం గుర్తించి వారి పేర్లను కూడా బీమాలో చేర్చేలా అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. జిల్లాలో 5 ఎకరాలలోపు 92,740 మంది, 5 ఎకరాలకు పైగా ఉన్న రైతులు 9,223 మంది ఉన్నారు. స్థానికంగా లేకున్నా.. వలస వెళ్లినా.. వారిని గుర్తించి దరఖాస్తు చేయించనున్నారు.
ప్రతి రైతుకూ వర్తింపజేస్తాం..
రైతు బీమాకు సంబంధించి ప్రభుత్వం విధివిధానాలను వెల్లడించింది. ప్రభుత్వ ఆదేశం మేరకు రైతు బీమా పథకాన్ని ప్రతి రైతుకూ వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటాం. కొత్తగా పాస్ పుస్తకాలు జారీ అయిన రైతులతోపాటు గతంలో దరఖాస్తు చేసుకోలేక పోయినవారు కూడా బీమాలో చేర్చించేలా చూస్తాం. ఈ నెలాఖరు నాటికి రెన్యూవల్ ప్రక్రియ సైతం పూర్తవుతుంది.
-గీతా రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, రంగారెడ్డి