వికారాబాద్, మే 20 : బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుకునేందుకు గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లాలో చదువుతున్న గిరిజన బాలబాలికలు 2024-25 విద్యా సంవత్సరానికి 3, 5, 8 తరగతుల్లో ప్రవేశాలకై దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో 64 సీట్లలో 3వ తరగతిలో 32 మందికిగాను లంబాడా బాలురు 18, బాలికలు 11, చెంచులకు 3 ఖాళీలుండగా బాలురు 1, బాలికలు 2కు అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఐదో తరగతిలో 16 ఖాళీలుండగా.. 10 లంబాడా బాలురకు, 4 బాలికలకు, చెంచులకు 2 ఉండగా.. బాలురు, బాలికలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించినట్లు చెప్పారు.
8వ తరగతిలో 16 ఖాళ్లీలో లంబాడా బాలురు 11, బాలికలు 4, ఒక చెంచు బాలికకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థికి మాత్రమే బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో అవకాశముంటుందని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతవాసులకు రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతవాసులకు రూ.2 లక్షలలోపు ఉండాలన్నారు. కులం, ఆదాయం, నివాసం, ఆధార్ కార్డు, పుట్టిన తేది సర్టిఫికెట్, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల బోనఫైడ్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో దరఖాస్తు సమర్పించాలన్నారు.
మే 21 నుంచి జూన్ 6 వరకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తులు పొంది, జూన్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయ పరిధిలో తమ దరఖాస్తులను సమర్పించాలన్నారు. జూన్ 12న లాటరీ విధానం ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుందని, ఎంపికైన విద్యార్థుల జాబితా జూన్ 13న జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో ప్రదర్శించబడుతుందని తెలిపారు. ప్రవేశానికి అవకాశం వచ్చినవారు జూన్ 14న పాఠశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఏదేని సమాచార నిమిత్తం 9948663053ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
షాబాద్ : జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా రంగారెడ్డి జిల్లాకు 89 సీట్లు కేటాయించినట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రత్నకల్యాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 89 సీట్లలో మూడో తరగతిలో 45, ఐదో తరగతిలో 22, ఎనిమిదో తరగతిలో 22 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాకు చెందిన గిరిజన తెగలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది జూన్ 6 అని చెప్పారు.
దరఖాస్తు ఫారాలు మే 21 నుంచి జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయం రంగారెడ్డిజిల్లా, 2వ అంతస్తు, సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం, రంగారెడ్డిజిల్లా, కొంగరకలాన్‌లో ఉచితంగా పొందవచ్చని చెప్పారు. దరఖాస్తు చేసుకునేందుకు కులం, ఆధార్‌కార్డు, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి బోనఫైడ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో కావాలన్నారు. సంవత్సరాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలకు మించి ఉండరాదన్నారు. జూన్ 6న సాయంత్రం 5గంటల లోగా దరఖాస్తులు తీసుకుంటారని ఆమె తెలిపారు.