వికారాబాద్, ఆగస్టు 22 : గృహలక్ష్మి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి శుక్రవారం వరకు ఆన్లైన్లో డాటా ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఓటర్ జాబితా నమోదు, గృహలక్ష్మి, హరితహారం తదితర అంశాలపై తహసీల్దార్లు, ఎంపీడీవోలతో అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, లింగ్యానాయక్‌లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గృహలక్ష్మి పథకం కింద గుర్తించిన లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలి
ఈ నెల 26న చేపట్టే మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. హరిత హారంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్‌పై దృష్టి సారించాలని, పల్లె ప్రకృతి, బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లకు ఇరువైపులా పెద్ద మొక్కలను పెద్ద మొత్తంలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో మంజూరైన 269 గ్రామ పంచాయతీ భవనాల పనులు వేగవంతం చేసేందుకు వారం రోజుల్లోగా బేస్మెంట్ వరకు పనులు జరిగేలా చూడాలన్నారు. అదనంగా గ్రామపంచాయతీ భవనాలకు ప్రతిపాదనలు వచ్చినైట్లెతే పరిపాలనాపరంగా మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామపంచాయతీ భవనాలు సెప్టెంబర్ 30లోగా ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
దళిత బంధుకు మొదటి ప్రాధాన్యతనివ్వాలి
దళిత బంధుకు మొదటి ప్రాధాన్యతనిస్తూ జాబితాలు అందిన ఎంపీడీవోలు క్షేత్ర స్థాయిలో పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి ఆన్లైన్లో డాటా ఎంట్రీ చేయాలని కలెక్టర్ సూచించారు. 18 సంవత్సరాల వయస్సు గల ప్రతిఒక్కరూ అక్టోబర్ 1 నాటికి ఓటరు నమోదు చేసుకునేలా కృషి చేయాలని తహసీల్దార్లకు సూచించారు. ఖాళీగా ఉన్న బూత్ స్థాయి అధికారుల నియామకాన్ని వెంటనే చేపట్టాలని కలెక్టర్ సూచించారు. డీఆర్డీఏ, మెప్మా సహకారంతో ఓటరుగా నమోదు కానివాళ్లను గుర్తించి మెగా క్యాంపు ద్వారా ఓటర్ నమోదు ప్రక్రియను చేపట్టాలన్నారు. ప్రభుత్వం కుల వృత్తులపై ఆధారపడ్డ కుటుంబాలకు అందించే ఆర్థిక సాయం జాబితాలపై కలెక్టర్ ఆరా తీశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీవో కృష్ణన్, అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, బీసీడీవో ఉపేందర్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి సుధారాణి, వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ జాకీర్అహ్మద్ ఉన్నారు.