Medical Officers | ‘కంచె చేను మేస్తే కాచేదెవరన్నట్లు’గా.. అధికారులే వసూళ్ల దందాకు పాల్పడి నకిలీ డాక్టర్లకు అనుమతులు ఇస్తే ప్రజల ప్రాణాలకు రక్షణేది.. కొందరు నకిలీ డాక్టర్లు క్లినిక్‌లు నడుపుతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతూ డబ్బులు దండుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణగా.. పరిగి పట్టణంలోని గ్లోబల్ క్లినిక్‌ను అర్హత లేకున్నా.. దోమ మండలానికి చెందిన రాజు.. నిర్వహిస్తుండగా, ఈనెల 6వ తేదీన డిప్యూటీ డీఎంహెచ్‌వో, డెమో శ్రీనివాస్ తనిఖీ చేసి సీజ్ చేశారు. అయితే మళ్లీ రెండు, మూడు రోజుల్లోనే క్లినిక్‌కు అనుమతి లభించి ఓపెన్ చేయగా, వైద్యాధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారితో సెటిల్మెంట్ చేసుకోవడంతోనే క్లినిక్‌కు అనుమతి ఇచ్చారని, ఈ వ్యవహారంలో రూ.లక్షలు వసూలు చేసుకుని నకిలీ డాక్టర్‌ను ఎంబీబీఎస్‌గా ధ్రువీకరించారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయమై సదరు నకిలీ వైద్యుడిని ప్రశ్నించగా.. ‘డీఎంహెచ్‌వో సార్‌ను కలువగా.. ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌గా నిర్వహించుకోవాలని చెప్పారు..’.. అని పేర్కొన్నారు. నకిలీ డాక్టర్‌పై చర్యలకు సిఫారసు చేయాల్సిన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకటరమణ… ఎందుకు అనుమతి ఇచ్చినట్లని విమర్శలు వస్తున్నాయి. ఇదొక్కటే కాదు క్లినిక్‌లు, దవాఖానల తనిఖీలు, సీజ్‌ల పేరిట వైద్యాధికారులు వసూళ్ల దందా కొనసాగిస్తున్నారని కలెక్టర్, ఏసీబీ అధికారులు దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
– వికారాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో పుట్టగొడుగుల్లా క్లినిక్‌లు వెలుస్తున్నాయి. కొందరు అర్హత ఉన్నవారు క్లినిక్‌లను నెలకొల్పితే.. కొందరు నకిలీ డాక్టర్లు క్లినిక్‌ల పేరుతో నయా దందాకు తెరలేపుతున్నారు. జిల్లా వైద్యాధికారులు క్లినిక్‌లు, దవాఖానలను తనిఖీలు చేస్తూ అప్పుడప్పుడు హల్చల్ చేస్తుంటారు.. అనుమతిలేని క్లినిక్‌ను సీజ్ చేశామంటూ మీడియాలో ప్రచారం చేసుకుంటారు.. తర్వాత వాళ్లే సెటిల్మెంట్కు పిలిచి రూ.లక్షల్లో వసూలు చేసి సీజ్ అయిన క్లినిక్‌లకు అనుమతులు ఇస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీజ్ అయిన క్లినిక్‌ల నిర్వాహకుల వద్ద రూ.2లక్షల నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రైవేటు దవాఖానలు, క్లినిక్‌లే కాకుండా.. వైద్యారోగ్య శాఖ కార్యాలయంలోనూ ప్రతీది పైసలిస్తేనే ముందుకు వెళ్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎలాంటి విద్యార్హతలు లేని కారణంగా పరిగి పట్టణంలోని గ్లోబల్ క్లినిక్‌ను డిప్యూటీ డీఎంహెచ్‌వోతో కలిసి సీజ్ చేశాం. సంబంధిత క్లినిక్ యథావిధిగా కొనసాగుతున్న విషయం తెలువదు.. అది.. డీఎంహెచ్వోకే తెలుసు.. ఈ వ్యవహారమంతా ఆయనే చూసుకుంటున్నారు..
– డెమో శ్రీనివాస్