రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 13 : జిల్లాలో ధాన్యం సేకరణ జోరందుకుంది. డీసీఎంఎస్, ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 39 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. వానకాలం సీజన్‌కుగాను 1.70 లక్షల మెట్రిక్ టన్నుల సేకరించేందుకు జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి బిల్లుల చెల్లింపుల్లోనూ వేగవంతం చేశారు. బిల్లుల తయారు విషయంలో కొన్ని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు జాప్యం చేస్తుండడంతో రైతులకు చెల్లింపుల్లో కొంతమేర ఆలస్యమవుతున్నది. ధాన్యం విక్రయించిన బిల్లులు జిల్లా పౌరసరఫరాల శాఖకు చేరిన 24 గంటల్లోపే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు చెల్లింపులను జమ చేస్తున్నారు. జిల్లాలో 2880 మంది రైతుల నుంచి రూ.24.33 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించగా, 863 రైతులకు రూ.1.84 కోట్ల చెల్లింపులను పూర్తి చేశారు.
ధాన్యం సేకరణ
జిల్లాలో ఇప్పటివరకు 39 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించారు. అదేవిధంగా వానకాలం సీజన్‌కుగాను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లాలో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకేరోజు రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకుండా ఐదుగురు చొప్పున రైతులుండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. రోజుకు 50 మంది రైతుల నుంచి 1000 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ధాన్యం సేకరణకు అవసరమయ్యే గోనెసంచులను అందుబాటులో ఉంచారు. వరి ఏ గ్రేడ్ క్వింటాలుకు రూ.1960, సాధారణ గ్రేడ్ క్వింటాలుకు రూ.1940 కనీస మద్దతు ధర రైతులకు చెల్లించి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. జిల్లాలో వానకాలం సీజన్లో 85,119 మంది రైతులు 1.26 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా 2.91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు :తిరుపతిరావు, జిల్లా అదనపు కలెక్టర్
జిల్లావ్యాప్తంగా ధాన్యాన్ని విక్రయించే రైతులెవరికి కూడా ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు తెలిపారు. ధాన్యాన్ని తెచ్చే రైతులు తాలు, గింజలు, పొల్లు లేకుండా తీసుకురావాలని, తేమ శాతం తప్పనిసరిగా 17 శాతంలోపు ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించే సమయంలో వారి ఫోన్ నెంబర్‌కు ఓటిపి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఫోన్‌ను వెంట తీసుకురావాలన్నారు. ప్రతీ రైతు తమ ఫోన్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేసుకోవాలన్నారు.