రంగారెడ్డి, నవంబర్ 23(నమస్తే తెలంగాణ)/బడంగిపేట: ముస్లిం మైనార్టీ పిల్లల కోసం పహాడీషరీఫ్‌లో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నామని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డికి మద్దతుగా గురువారం సుల్తాన్‌పూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు సబితమ్మకు మద్దతు తెలిపి.. భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. వర్షంలోనూ ఇంతమంది రావడంతోనే సబితా రెడ్డి గెలుపు ఖాయమైపోయిందన్నారు. మంచి నాయకురాలు, మంచిగా పనిచేసే వ్యక్తి సబితను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
మొదటిది ముంపు సమస్య.. అది పరిష్కారం అయింది. ఇక రెండోది తాగునీటి సమస్య. పేరుకు హైదరాబాద్ కానీ చాలా సమస్యలు ఉండే. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం ప్రాంతాల్లో మొత్తం క్రిటికల్ ప్రాబ్లం ఉండే. పైపు లైన్ వేయమని, దాన్ని నివారించాలని చెప్పి రూ. 670 కోట్లతో శివారు నగరాలకు మంచినీళ్లు తీసుకొచ్చి బాధలు తీర్చాం. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ప్రత్యేక పైపు లైన్ వస్తుంది. అది పూర్తయితే శాశ్వతంగా మంచి నీటి బాధలు తీరుతాయని సీఎం తెలిపారు.
మీ మౌలిక వసతులు, తాగునీరు, రోడ్ల అభివృద్ధి గురించి ఆమె పడే తపన మామూలుగా ఉండదు. ఆమె మంత్రి అనుకోదు. మహేశ్వరం నుంచి సామాన్య కార్యకర్త అనుకుంటది. ఆమెకు గర్వం ఉండదు. నిగర్వి. చాలా హుందాతనంగా, పద్ధతిగా ఉంటూ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. ఎడ్యుకేషన్ మంత్రిగా ఉండి కూడా తానే గర్వానికి పోయి మంజూరు చేసుకోలేదు. పద్ధతి పాటించి నన్ను కోరితే లా, డిగ్రీ, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశాం. ఇంత పట్టింపుతో పని చేసిన ఎమ్మెల్యే ఇంత వరకు ఎవరూ రాలేదు. ఇన్ని మంచి పనులు చేశారు.. అని సీఎం కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ తీరు.. వంటలు చేసి పెట్టండి. మేము వడ్డిస్తామన్న చందంగా ఉన్నది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్లనే రాష్ట్రంలో సంపద పెరిగింది. దానిని తుంచడానికి కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతున్నది. రైతులకు 24 గంటల విద్యుత్ వృథా అని పీసీసీ అధ్యక్షుడు అంటే.. రైతుబంధు దుబారా అని పీసీసీ మాజీ అధ్యక్షుడు చెబుతున్నాడు. ధరణి స్థానంలో కాంగ్రెస్ తెచ్చేది భూమాత కాదని.. భూ మేత అని సీఎం ఎద్దేవ చేశారు. ఓటు అనే ఆయుధాన్ని జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. మీరు వేసే ఓటు ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అభ్యర్థిని, వారి పార్టీని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలి. ప్రజల కోసం అనునిత్యం పనిచేసే సబితా ఇంద్రారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఉదయం వర్షం పడ్డా, ఇప్పుడు పడుతూనే ఉన్నా.. మీరు ఇంత మంది వచ్చారంటే సబిత గెలుపు ఖాయమైపోయింది. రోజు మీతో కలిసి ఉండే వ్యక్తి. సబితకు ఎంత ఓపిక ఉంటదో మీకు తెలుసు. భూదేవీకి ఎంత ఓపిక ఉంటదో సబితకు అంత ఓపిక ఉంటుంది. ఆమెకు వేరు వ్యాపకం లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. పొద్దున్నే తెల్లారి నుంచి మొదలుకుంటే రాత్రి 12 గంటల వరకు సబిత ఇంటికి పోతుంటారు. కలుస్తారు. మాట్లాడుతారు. వారి పరిధిలో ఉన్న పని వారే మంత్రిగా చేయిస్తరు. వారి పరిధి దాటి ఉంటే పట్టుబట్టి ఆ పని తన దగ్గరకు తీసుకొచ్చి చేయించే దాకా వదిలిపెట్టరని సీఎం అన్నారు.
కందుకూరుకు మెడికల్ కాలేజీ వచ్చిదంటే సబిత ఇంద్రారెడ్డినే కారణం. పట్టుబట్టి మెడికల్ కాలేజీ తెప్పించుకున్నారు సబిత. మెడికల్ కాలేజీకి అనుబంధంగా 500 పడకల ఆస్పత్రి రాబోతుంది. స్థానికంగా ఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగం. పారామెడికల్, నర్సింగ్ కాలేజీలు వస్తాయి. కందుకూరు మంచి హబ్‌గా మారబోతోంది. మెట్రో రైలు కందుకూరు దాకా రావాలని కేబినెట్ మీటింగ్‌లో పోరాటం చేశారు. తుక్కుగూడ ప్రాంతంలో 52 కొత్త పరిశ్రమలు వచ్చాయి. జిల్లా కలెక్టరేట్ సమీపంలోనే ఉంది. ఫ్యాక్స్ కాన్ ఇండస్ట్రీ వచ్చింది. లక్ష మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. చైనాలో ఉన్న పెద్ద కంపెనీ మూసుకుని ఇక్కడికి వస్తాం.. కొంత జాగా ఇవ్వండని అంటున్నారు. అది ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోతోంది. దగ్గరపడ్డది. దీంతో 2, 3 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం చెప్పారు.
ఒక సందర్భం నాకు గుర్తు ఉన్నది. బడంగ్పేట్, జల్పల్లి, మీర్‌పేట, తుక్కుగూడ.. ఇక్కడ పెద్ద ఓ క్రిటికల్ సమస్య ఉండే. కాంగ్రెస్‌లో ఉన్నటువంటి దగాకోరు, కబ్జాకోరు రాజ్యం సృష్టించిన సమస్య. చెరువులు ఉన్నాయి. వర్షాలు ఎక్కువ పడితే.. కిందకు నీళ్లు వదిలితే కింద కొట్టుకుపోతది. విడువకపోతే మీద కాలనీలు మునిగిపోతాయి. ఇగ చూడు తంట ఎట్ల ఉంటదో.. ముందు నొయ్యి వెనుక గొయ్యి.. అదంతా కాంగ్రెస్ రాజ్యం సృష్టించిన కథ. అక్కడ పర్మిషన్లు ఇస్తే తగిన బందోబస్తు చేయాలి కదా..? రెండు, మూడేండ్ల కింద భయంకరమైన వర్షాలు పడుతున్నాయి. ఆమె స్వయంగా అక్కడ తిరిగి, ఆ ఫొటోలు, వీడియోలు తనకు చూపించి, ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పారు.
మున్సిపల్ మినిస్టర్, సబిత, నేను అందరం కూర్చొని నిర్ణయం చేసి సిటీ సబర్బన్ ఏరియాలో ఈ నాలాల సమస్య ఉందని చెప్పి, సబిత పుణ్యమా అని హైదరాబాద్ నగరానికి 1000 కోట్లు మంజూరు చేసి నాలా డెలవప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఇక ఇప్పుడు మీ దగ్గర ఆ ప్రాబ్లం పోయింది. ఆ కాలనీల వారంత సబితకు దండం పెట్టాలని కోరతున్నా. వరద ముప్పు లేదు. కొట్టుకుపోయే పరిస్థితి లేదు. పెద్ద సమస్య తీరిపోయింది. ఆ చెరువులను, నాలాలను సుందరీకరణ చేసి అద్భుతంగా తీర్చిదిద్దారు. అలాంటి క్రిటికల్ ఇష్యూను పరిష్కారం చేశారు సబిత. ఈ విషయాన్ని మరిచిపోవద్దని ప్రజలకు సీఎం సూచించారు.