పెద్దఅంబర్‌పేట, జనవరి 21 : పండుగ అనగానే ఇంట్లో సంతోషంగా జరుపుకోవాలి అనుకుంటారు చాలామంది. దావత్, బర్త్‌డే పార్టీలు జరుపుకోవాలనుకుంటే చుట్టాలు, దోస్తులను పిలిచి ఎంజాయ్ చేయాలని భావిస్తారు ఇంకొంతమంది. ప్రత్యేక దినోత్సవాలు, సందర్భాల్లో పదిమంది తెలిసినవాళ్లతో కలిసి చేసుకోవాలనుకుంటారు మరికొంతమంది. కానీ, ఇవే సందర్భాలను ప్రత్యేకంగా జరుపుకొంటూ తీపి జ్ఞాపకాలుగా మలుచుకుంటున్నారు పలువురు. అనాథ, వృద్ధాశ్రమాల్లో పుట్టిన రోజు, పండుగ సంబురాలను జరుపుకొంటున్నారు. అనాథల ఆకలి తీరుస్తూనే.. తమ పిల్లలకు ఓ మంచి బాట చూపుతున్నారు. అనవసర ఆర్భాటాలకు పెట్టే ఖర్చులో కొంతైనా అభాగ్యుల ఆకలి తీర్చేందుకు వినియోగించాలని సందేశం పంపుతున్నారు. వీరి బాట నిజంగా ఆదర్శమే.
సరదాగా ఆటపాటలు
పెండ్లి రోజు వేడుకలను, పిల్లల పుట్టిన రోజు ఉత్సవాలను అనాథ, వృద్ధాశ్రమాల్లో జరుపుకొనేందుకు చాలామంది యువ తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. కొద్దిసమయం అనాథలతో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. నలుగురికి పట్టెడన్నం పెట్టామన్న సంతోషాన్ని ఎల్లకాలం గుర్తుంచుకుంటున్నారు. అనాథాశ్రమాలను సంబురాలకు నెలవుగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయాన్ని పదిమందితో పంచుకుంటున్నారు.
సంబురాలకు వేదిక
అనాథాశ్రమాల్లో చిన్నారులతో ఎక్కువ సమయం గడిపేందుకు యువ తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆశ్రమ నిర్వాహకులకు ముందస్తుగా సమాచారం ఇస్తున్నారు. చిన్నారులకు ఒక పూట భోజనం ఏర్పాటుచేసేందుకు ఇష్టపడుతున్నారు. నిర్వాహకుల సూచనల మేరకు కేకులు తీసుకొచ్చి.. అనాథ పిల్లల మధ్య కోస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. చిన్నారులంతా కలిసి ‘హ్యాపీ బర్త్‌డే టూ యూ’ అంటూ తమ పిల్లలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తుండటాన్ని చూసి సంతోషంగా భావిస్తున్నారు. ఆపై పిల్లల వ్యక్తిగత సమాచారం గురించి సైతం ఆరా తీస్తున్నారు. వివిధ రంగాల్లో పిల్లలు చూపుతున్న ప్రతిభను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అనాథల ఆసక్తులను తెలుసుకుంటూ వారు వ్యక్తిగతంగా రాటుదేలేందుకు వీలుగా అవసరమైన సాయం చేసేందుకు కొందరు ముందుకొస్తున్నారు. చిన్నారులతో కలిసి ఆటలు ఆడుతున్నారు. పాటలు పాడుతున్నారు.
పండుగలకూ ప్రత్యేకంగా..
మరికొంతమంది యువ తల్లిదండ్రులు వివిధ పండుగలను సైతం అనాథాశ్రమాల్లో జరుపుకొంటున్నారు. దీపావళికి స్వయంగా పటాకులు తీసుకెళ్లి, సంక్రాంతి సమయంలో పతంగులు తీసుకెళ్తూ అనాథలతో కలిసి పండుగ చేసుకుంటున్నారు. తమను విడిచివెళ్లిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సైతం పలువురు అన్నదానం చేస్తున్నారు. అనాథల మోముల్లో సంతోషాన్ని చూస్తూ ఆనందపడుతున్నారు.

సహపంక్తి భోజనాలు
పిల్లల పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని అనాథల ఆకలి తీర్చేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు. కొందరు తామే వండి తీసుకొస్తుండగా.. ఇంకొందరు ఆశ్రమ నిర్వాహకులకే డబ్బులందజేస్తున్నారు. ఆశ్రమాల్లో ఉం టున్న పిల్లల సంఖ్యకనుగుణంగా ఆ ఖర్చును భరిస్తామని చెప్తున్నారు. కొందరు శాకాహారం పెట్టిస్తుండగా.. ఇంకొందరు మాంసాహారం పెట్టించేందుకు ఇష్టపడుతున్నారు. ఆయా రోజుల్లో కుటుంబసభ్యులతో కలిసి అనాథాశ్రమాలకు వెళ్తున్నారు. అనాథ పిల్లలతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తున్నారు.
అనాథలతో కలిసి వేడుక : మద్ది సరితారెడ్డి, తట్టిఅన్నారం, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ ప్రతి ఏడాది మా అల్లుడి పుట్టిన రోజును అనాథాశ్రమంలోనే నిర్వహిస్తున్నాం. అనాథలతో కలిసి వేడుకను జరుపుకోవడం చాలా సంతోషాన్నిస్తుంది. కుటుంబసభ్యులందరం కలిసి వెళ్తాం. చిన్నారులతోనే కూర్చుని వారితో సరదాగా మాట్లాడుతాం. పలు రంగాల్లో వారు చూపిస్తున్న ప్రతిభను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. మా ఇంట్లో జరిగే ప్రత్యేక సందర్భాన్ని కూడా అనాథ విద్యార్థులతో కలిసి జరుపుకోవాలనుకుంటున్నాం.
ప్రతి పుట్టిన రోజూ అక్కడే.. : క్రాంతి, జీవీఆర్ కాలనీ, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పిల్లల ప్రతి పుట్టిన రోజు వేడుకను అనాథాశ్రమాల్లోనే నిర్వహిస్తున్నాను. అందులోనే సంతోషం ఉన్నది. ఇంటి గృహ ప్రవేశం సమయంలో కూడా అనాథ పిల్లల కోసం ప్రత్యేకంగా క్యాటరింగ్ ఇచ్చి వండించాం. ఉదయం ఇంట్లో చుట్టాలతో వేడుక చేసుకుని, సాయంత్రం అనాథ పిల్లలతో గడిపాం. ప్రతి ప్రత్యేక సందర్భంలోనూ అనాథాశ్రమాల్లో ఏదైనా సేవా కార్యక్రమం నిర్వహిస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో మా పిల్లలు చాలా సంతోషంగా ఉంటున్నారు.
అన్నం పెట్టడంలోనే సంతృప్తి : సబిత, స్పందన ఆశ్రమ నిర్వాహకురాలు, తట్టి అన్నారం, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ అనాథలు, తల్లిదండ్రుల్లో ఒకరు మాత్రమే ఉన్న పిల్లలు మా దగ్గర ఉన్నారు. కరోనా వ్యాప్తికి ముందు చాలామంది వచ్చి మా ఆశ్రమంలో పిల్లల బర్త్‌డే పార్టీలు చేస్తుండేవారు. ఆ తర్వాత చాలా తగ్గింది. ఇటీవల కొంతమంది మళ్లీ ముందుకు వస్తున్నారు. పిల్లలకు కేకులు అందిస్తూ.. భోజనాలు సైతం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. పిల్లలతో గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు.