రంగారెడ్డి, జూన్ 6(నమస్తే తెలంగాణ) : లోక్‌సభ ఓటింగ్ సరళిలో చేవెళ్ల ప్రత్యేకతను చాటుకున్నది. పెరిగిన ఓటర్లతో చేవెళ్ల లోక్‌సభ ఈసారి ఎన్నికల్లో రికార్డు సృష్టించింది. గతంతో పోలిస్తే ఈసారి 3,58,154 (27.57శాతం) మంది ఓటర్లు పెరిగారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల కంటే చేవెళ్లదే అగ్రస్థానమని అధికారులు చెబుతున్నారు. స్వీప్(సిస్టమెటిక్ ఓటరు ఎడ్యుకేషన్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శశాంక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వడంతోనే ఇది సాధ్యపడిందని అధికారులు పేర్కొంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ స్థానం పరిధిలో తక్కువ ఓటర్ల సంఖ్య నమోదవుతూ వస్తున్నది. ఈ ఎంపీ స్థానంలో చాలావరకు అసెంబ్లీ నియోజకవర్గాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. ఓటర్లు ఆసక్తి చూపకపోవడంతో 2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్ సభ పరిధిలో 60.05 శాతం పోలింగ్ నమోదు అయింది. 2019 ఎన్నికలకు వచ్చేసరికి పోలింగ్ శాతం 53.18 శాతానికి తగ్గింది. గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ రంగారెడ్డి జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్ నమోదైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదవగా.. 2023 ఎన్నికల్లో 59.96 శాతం మాత్రమే పోలైంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తగా.. పట్టణాల్లోని ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఈ రెండు ఎన్నికల మధ్య పోలింగ్ శాతం 2 శాతం తగ్గింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటింగ్ శాతాన్ని పెంచడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ మేరకు జిల్లాయంత్రాంగం ఈసీ మార్గ నిర్దేశం మేరకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసి అమలు చేసింది. ఓటింగ్ నమోదు నుంచి పోలింగ్ వరకు స్వీప్ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంటు స్థానం పరిధిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పోలింగ్ రోజున పట్టణ వాసులు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా ఓటింగ్‌పై యువత సైతం అశ్రద్ధగా ఉంటున్నది. పోలింగ్ రోజున సెలవు ప్రకటించడంతో చాలామంది సెలవు దినాన్ని ఓటు హక్కుకోసం వినియోగించుకోక ఇంటి పట్టునే ఉంటున్నారు. ఒకే కుటుంబంలోని ఓటర్లను వేర్వేరు పోలింగ్ బూత్‌లకు కేటాయించడం, క్యూలో వెయిట్ చేయడం వంటి కారణాలు తక్కువ ఓటింగ్‌కు కారణమవుతున్నాయని గుర్తించి ఆ మేరకు తగురీతిలో చర్యలు చేపట్టారు. మూడంచెల వ్యూహంలో భాగంగా.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భిన్నమైన వ్యూహాలను అమలుపర్చారు.
యువతతోపాటు ఐటీ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు పోలింగ్ రోజున ఓటు హక్కును వినియోగించుకునేలా సమావేశాలు నిర్వహించి ఓటు ప్రాధాన్యతను వివరించారు. ఈసారి కొత్తగా పాఠశాల విద్యార్థులను భాగస్వామ్యులను చేసి ‘తెలంగాణ ఓటరు సంకల్ప పత్రం’ పేరుతో వినూత్న ప్రచారాన్ని చేపట్టారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు సంకల్ప పత్రాలను అందజేసి వారి ద్వారా ఓటు ఆవశ్యకతపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. మరోపక్క వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులతో ఓటు విలువ తెలిసేలా ఏర్పాట్లు చేసి చైతన్యపర్చారు.
ఓటర్ల పరంగా చూస్తే..2019 ఎన్నికల్లో 12,98,953 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటే..ప్రస్తుత ఎన్నికల్లో 16,57,107 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. గత ఎన్నికతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో 3,58,154 (27.5శాతం) ఓటర్లు పెరిగారు.
