Chilkur Balaji Temple | మొయినాబాద్, ఫిబ్రవరి10:చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడిని వివిధ పార్టీ నాయకులు, హిందూ మత పెద్దలు తీవ్రంగా ఖండించారు. చేవెళ్ల చెమ్మెల్యే కాలె యాదయ్య, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పటోళ్ల కార్తిక్‌రెడ్డి, కొంపల్లి అనంతరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు, జనసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. మహేందర్ రెడ్డి, తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జి శంకర్ గౌడ్ లు రంగరాజన్‌ను పరమర్శించారు. ఆయనతో మాట్లాడి దాడి గురించి తెలుసుకున్నారు. స్వామి వారికి ఎంతో సేవ చేస్తూ లక్షలాది మంది భక్తుల అభిమానం పెంచుకున్న తమకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతామని మనోధైర్యం ఇచ్చారు. భువనేశ్వరి పీఠం పీఠాధిపతి కమలానంద భారతీస్వామి సైతం పరామర్శించారు.
ఈ సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మీడియాతో మాట్లాడుతూ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడి వ్యక్తిపై కాదని అది ధర్మంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. రంగరాజన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ధర్మం కోసం పని చేసే వారు హిందు ధర్మంపై దాడి చేయడం మంచి పద్దతి కాదని అన్నారు. దాడికి సంబంధించిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే విధంగా చిలుకూరు మాజీ సర్పంచ్ పురాణం వీరభద్రస్వామి కూడ రంగరాజన్‌పై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు.