చేవెళ్లటౌన్, ఏప్రిల్ 3 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లోని 400 ఎకరాల భూమిని వేలం వేసి ప్రభుత్వం డబ్బు సంపాదించాలని చూడడం చాలా దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన చేవెళ్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హెచ్‌సీయూలోని 400 ఎకరాల పరిధిలోని ప్రాంతాన్ని ప్రభుత్వం వేలం వేసి డబ్బు సంపాదించాలనే ప్రణాళికలో భాగంగా రాత్రికి రాత్రికే అక్కడ జీవిస్తున్న వన్యప్రాణులు, వివిధ రకాల జీవులను హింసించి బుల్డోజర్లతో చెట్లను ధ్వంసం చేసిందని మండిపడ్డారు.
మీకు డబ్బులు అవసరమైనప్పుడు రాత్రికి రాత్రే చెట్లను ధ్వంసం చేస్తారు.. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు పోతున్నాయి చేవెళ్ల-బీజాపూర్ జాతీయ రహదారి పనులను అప్పా నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్లుగా విస్తరించాలని తాము పలుసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోరు.. చెట్లు అడ్డువస్తున్నాయని ఆ పనులను నిలిపేశారు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్ల-బీజాపూర్ రోడ్డు మంజూరై రెండేండ్లు దాటుతున్నదని.. ఆ రోడ్డు పనులను ఎప్పుడు ప్రారంభించి.. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని సీఎంను కోరారు. ఇప్పటికైనా బీజాపూర్ హైవే విస్తరణ పనులను ప్రారంభించాలని.. ప్రజల ప్రాణాలతో రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు దేశమొళ్ల ఆంజనేయులు, చేవెళ్ల నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శివప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, మాజీ డైరెక్టర్లు వెంకటేశ్, కర్నాకర్‌రెడ్డి, ఎల్లయ్య, శేఖర్‌రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.