షాబాద్ మండలంలోని చందనవెల్లి గ్రామం పరిశ్రమల కల్పవల్లిగా వెలుగొందుతున్నది. ఒకప్పుడు మారుమూల పల్లెగా ఉండగా.. ప్రస్తుతం ఇండస్ట్రియల్ పార్కుతో రాష్ర్టానికే తలమానికంగా మారుతున్నది. కేవలం ఐదేండ్లలో రూ.13,508కోట్ల పెట్టుబడులతో 40 పరిశ్రమలు ఇక్కడ కొలువుదీరగా.. 3,210 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఐటీ కారిడార్‌కు చేరువగా ఉండడం, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి చందనవెల్లికి అరగంటలోనే చేరుకోవడం వంటి అనేక అనుకూల పరిస్థితుల నేపథ్యంలో చాలా కంపెనీలు ఇక్కడ తమ శాఖల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి కోసం ప్రభుత్వం 2,060.34 ఎకరాలను కేటాయించింది. అంతేకాకుండా 799 ఎకరాల్లో 194 ప్లాట్లు చేసి విడుతల వారీగా కంపెనీలకు కేటాయిస్తున్నది. ఇప్పటివరకు 103 కంపెనీలకు ప్లాట్లను కేటాయించింది. వెల్స్పన్, ఆమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ వంటి ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఏర్పాటయ్యాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తులను సైతం ప్రారంభించగా.. మరికొన్ని కంపెనీల పనులు తుది దశకు చేరుకున్నాయి. స్థానికంగా ఉన్న ఐటీఐని దత్తత తీసుకుని స్థానికులకు శిక్షణ ఇచ్చి తమ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని త్వరలో ఏర్పాటు కానున్న జపాన్‌కు చెందిన దైఫుకు, నికోమాక్ తైకిషా కంపెనీలు ప్రకటించాయి. ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు ముందుకు సాగనుండడంతో స్థానిక యువతలో కొత్త జోష్ కనిపిస్తున్నది.
రంగారెడ్డి, జూలై 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో తీసుకొచ్చిన మార్పులతో రంగారెడ్డి జిల్లానే కాదు..చందనవెల్లి ప్రాంతం ముఖచిత్రం సైతం మారిపోయింది. జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలంటే పారిశ్రామిక వేత్తలు చందనవెల్లి వైపునే చూస్తున్నారు. ఔటర్ నుంచి అరగంట ప్రయాణం.. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఐటీ కారిడార్‌కు చేరువగా ఉండడం.. వంటి అనుకూల పరిస్థితుల నేపథ్యంలో పారిశ్రామిక వేత్తల చూపు చందనవెల్లి వైపు మళ్లుతోంది. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అనుకూలతలు ఉన్న చందనవెల్లిలోనే పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలు సైతం ఆసక్తి చూపుతున్నారు. నాలుగు భారీ కంపెనీలు ఇక్కడే కార్యకలాపాలను మొదలుపెట్టగా.. మరో మూడు పెద్ద ప్రాజెక్టులు చందనవెల్లిలోనే ఏర్పాటవుతున్నాయి. చుట్టూత ఉన్న చేవెళ్ల, సీతారాంపూర్, శంకర్పల్లి ప్రాంతాలకూ పరిశ్రమలు విస్తరిస్తుండడంతో చందనవెల్లి ప్రాంతం పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
పరిశ్రమలకు గమ్యస్థానంగా..
చేవెళ్ల పట్టణ కేంద్రానికి 10 నుంచి 12 కి.మీ. దూరంలో ఉన్న షాబాద్ మండలంలోని చందనవెల్లి భారీ పరిశ్రమలకు గమ్యస్థానంగా మారింది. చందనవెల్లిలో ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి కోసం 2,060.34 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 1,569.89 ఎకరాల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు టీఎస్ఐఐసీ లే అవుట్ చేసి 799 ఎకరాల్లో 194 ప్లాట్లు చేసి విడుతల వారీగా కంపెనీలకు ప్లాట్లను కేటాయిస్తూ వస్తోంది. తాజాగా..దైఫుకు, నికోమాక్ తైకిషా కంపెనీలకు సైతం ప్లాట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో చందనవెల్లి ఇండస్ట్రియల్ పార్కులో ఇప్పటి వరకు 103 కంపెనీలకు ప్లాట్లను కేటాయించినైట్లెంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే నిర్మాణ పనులను పూర్తి చేసుకుని ఉత్పత్తులను సైతం మొదలుపెట్టగా.. మిగిలిన కంపెనీల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి.
చుట్టూత విస్తరిస్తున్న పరిశ్రమలు..
చందనవెల్లి ప్రాంతంలో ఐటీ రంగం వేగంగా విస్తరిస్తున్నది. చందనవెల్లితోపాటు చుట్టూత చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి మండలాలకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతాల్లో 84 పరిశ్రమలు రూ.14,870 కోట్ల పెట్టుబడులతో కొలువుదీరాయి. ఇప్పటికే 55 కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించగా 4,153 మందికి ఉపాధి లభిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు చేవెళ్ల నియోజకవర్గంలో 49 కంపెనీలు కేవలం రూ.82.959కోట్ల వ్యయంతో నెలకొల్పి 842 మందికి మాత్రమే ఉపాధి చూపాయి. చేవెళ్ల మండలంలో స్పిన్‌మ్యాక్స్ టైర్స్ కంపెనీ రూ.214కోట్లతో నెలకొల్పింది.
ఈ పరిశ్రమ వల్ల వంద మందికి ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. సీతారాంపూర్‌లో ఈస్టర్ ఫిల్మ్‌టెక్ లిమిటెడ్ కంపెనీని రూ.1400కోట్ల పెట్టుబడులతో స్థాపించి 800 మందికి ఉపాధి చూపుతున్నది. శంకర్పల్లి మండలంలోకి కొండగల్ వద్ద రూ.650కోట్ల పెట్టుబడితో మేధా సర్వో డ్రైవ్స్ కంపెనీ నెలకొల్పిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీతో 200 మందికి ఉద్యోగావకాశాలు కలిగాయి. కిటెక్స్ అప్పారెల్ పార్క్స్ లిమిటెడ్ రూ.1400కోట్ల పెట్టుబడితో గార్మెంట్స్ తయారీకి సంబంధించిన పరిశ్రమను త్వరలోనే ఏర్పాటు చేయనుండడంతో పెద్ద ఎత్తున 11,233 మందికి ఉపాధి లభించనున్నది.
ఉద్యోగాల కల్పనపై స్థానికుల్లో జోష్..
చందనవెల్లిలో నెలకొల్పిన పరిశ్రమల యాజమాన్యాలు స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. స్థానికంగా ఉన్న ఐటీఐను దత్తత తీసుకుని ఉద్యోగాలకు అవసరమైన శిక్షణను అందించి తమ కంపెనీల్లో అవకాశాలు కల్పిస్తామని జపాన్‌కు చెందిన దైఫుకు, నికోమాక్ తైకిషా కంపెనీలు ప్రకటించాయి. ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు ముందుకు సాగనున్నాయి. దీంతో ఉద్యోగాల కల్పన విషయంలో స్థానిక యువతలో కొత్త జోష్ కనిపిస్తున్నది.