Antonio Rattín : అర్జెంటీనా (Argentina) ఫుట్‌బాల్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ ఆంటోనియో ఉబాల్డో రాటిన్ (Antonio Ubalto Ratin) ఇవాళ (ఆదివారం) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 89 ఏళ్లు. ఫుట్‌బాల్‌లో ఎల్లో, రెడ్ కార్డుల (Yellow, Red cards) వ్యవస్థ రావడానికి కారణమైన చారిత్రక ఘట్టంలో కీలకపాత్ర పోషించిన రాటిన్ మృతితో ఫుట్‌బాల్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణంపట్ల అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) అధ్యక్షుడు క్లాడియో టాపియా (Cladio Tapia) తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. రాటిన్ ఒక గొప్ప కెప్టెన్ అని, అర్జెంటీనా ఫుట్‌బాల్‌కు తిరుగులేని ఐకాన్ అని కొనియాడారు.
1966లో ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఆతిథ్య జట్టుతో అర్జెంటీనా తలపడింది. ఆ మ్యాచ్‌లో జర్మనీకి చెందిన రెఫరీ రుడాల్ఫ్ క్రీట్‌లీన్.. అర్జెంటీనా కెప్టెన్ రాటిన్‌ను మైదానం వీడాల్సిందిగా ఆదేశించారు. అప్పట్లో ఆటగాళ్లను హెచ్చరించేందుకు కార్డుల విధానం లేదు. రెఫరీ నిర్ణయం అన్యాయమని భావించిన రాటిన్.. భాష అర్థం కాకపోవడంతో అనువాదకుడు కావాలని డిమాండ్ చేస్తూ మైదానంలోనే భీష్మించుకు కూర్చున్నాడు. అంతటితో ఆగకుండా బ్రిటన్ రాణి కోసం ప్రత్యేకంగా పరిచిన రెడ్ కార్పెట్‌పై కూర్చొని నిరసన తెలపడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.
ఈ ఘటన ఫుట్‌బాల్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. దీని ఫలితంగానే రెఫరీల నిర్ణయాలు ఆటగాళ్లకు స్పష్టంగా తెలియజేయడానికి ఫిఫా 1970 ప్రపంచకప్ నుంచి ఎల్లో, రెడ్ కార్డుల విధానాన్ని అధికారికంగా ప్రవేశపెట్టింది. రాటిన్ తన క్లబ్ కెరీర్ మొత్తాన్ని (1956-1970) ప్రఖ్యాత ‘బోకా జూనియర్స్’ క్లబ్‌కే అంకితం చేశాడు. ఆ క్లబ్ తరఫున 382 మ్యాచ్‌లు ఆడి నాలుగు లీగ్ టైటిళ్లను గెలుచుకున్నాడు. 1962, 1966 ప్రపంచకప్‌లలో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆటగాడిగా రిటైర్ అయ్యాక కోచ్‌గా, రాజకీయ నాయకుడిగానూ ఆయన రాణించాడు.