సిటీబ్యూరో: విద్యుత్ శాఖలో అవినీతి మితిమీరిన స్థాయికి చేరింది. ఉన్నతాధికారులు మొదలుకొని కింది స్థాయి ఉద్యోగుల వరకు గత పది నెలలుగా ఏడుగురు ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశమైంది. తాజాగా ఏడీఈ కార్యాలయంలో సతీశ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో ఎస్పీడీసీఎల్లో కొందరు ఉద్యోగుల అవినీతిపై చర్చ జరుగుతోంది. సెప్టెంబర్‌లో సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఖైరతాబాద్‌లోని కార్పొరేట్ కార్యాలయంలో అవినీతి ఫిర్యాదు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రెండు నెంబర్లు 04023454884, 7680901912 ఇవ్వగా.. వీటికి మొదటి నెల తర్వాత పెద్దగా స్పందన లేదు. ఈ కేంద్రానికి మొదట్లో 10 నుంచి పదిహేను ఫిర్యాదులొచ్చాయి.అయితే వీటిపై ఉన్నతాధికారుల నుంచి సీరియస్‌గా స్పందన లేకపోవడంతో ఫిర్యాదుల సంఖ్య రానురాను తగ్గింది. కాల్‌సెంటర్‌కు స్పందన వస్తుందనుకున్నారో ఏమో.. ఇక ఆ విషయాన్నే మరిచిపోయారు. దీనికి కారణమేంటనే దిశగా సీఎండీ ఆరా తీశారు.
కొందరు అవినీతి ఉద్యోగుల చర్యలతో మొత్తం డిస్కంకే చెడ్డపేరు వస్తున్నదంటూ సీఎండీ ఉద్యోగులకు ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూ వచ్చారు. గత సంవత్సరం చివరలో ఏడుగురు అధికారులను సస్పెండ్ చేయడమే కాకుండా తొమ్మిది మందికి షోకాజ్‌నోటీసులు ఇచ్చారు. విద్యుత్ శాఖలో అధికారులు ఎవరైనా పనికి లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని సీఎండీ తెలిపారు. ఇందుకోసం సీఎండీ కార్యాలయంలో అవినీతి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. మొదట్లో సీఎండీ ఈ విషయంలో సీరియస్‌గా స్పందించినప్పటికీ ఆ తర్వాత సమ్మర్ యాక్షన్ ప్లాన్ నేపథ్యంలో బిజీ అయిపోయారు. అయితే కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులపై స్పందించడంలో సంబంధిత విభాగం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే ఫిర్యాదుల్లో ఎక్కువగా సైబర్‌సిటీ, సంగారెడ్డి, మేడ్చల్‌లతో పాటు రూరల్ ప్రాంతాల నుంచి ఉన్నాయి. వీటిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాల్సిన డిస్కం అధికారులు ఆ దిశగా పెద్దగా స్పందించలేదనే విమర్శలున్నాయి.
కాల్‌సెంటర్ల నెంబర్లు కేవలం స్టిక్కర్ల వరకే పరిమితం కాగా క్షేత్రస్థాయిలో మొత్తం దక్షిణ డిస్కం పరిధిలో పెద్దగా ప్రచారం జరగడం లేదన్న విమర్శలున్నాయి. ప్రధానంగా ఈ అవినీతి నిరోధానికి, లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలన్న అవగాహన వినియోగదారుల్లో కల్పించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలను కూడా కిందిస్థాయిలోనే ఆపేస్తున్నారు. ఈ నెంబర్లపై పెద్దగా ప్రచారం కూడా చేయడం లేదు. దీంతో ప్రజల్లో ఈ నెంబర్ల గురించి పెద్దగా తెలియదనే చెబుతున్నారు.