ఇబ్రహీంపట్నం, మే 20 : అన్నదాతలు పూర్వం వరిచేళ్లను కొడవళ్లతో మొదళ్ల దాకా కోసేవారు. అంతే కాకుండా అప్పటి రోజుల్లో పశువులు ఎక్కువగా.. వరిసాగు తక్కువగా ఉండటంతో పశుగ్రాసం కుప్పలు కుప్పలుగా పెట్టుకునేవారు. ప్రస్తుతం సాగు విధానంలో అనేక మార్చులు వచ్చాయి. యంత్రాలను విరివిగా ఉపయోగిస్తుండటంతో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మిషన్‌తో హార్వెస్టింగ్ చేసే సమయంలో పైకి కోయడం ద్వారా కొయ్యలు పెద్దగా మిగిలిపోతున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వరికోతలు ప్రారంభమైనందున రైతులు ఎంతో కొంత గడ్డిని తెచ్చుకోవడం, మిగిలిన దానిని అక్కడే వదిలివేస్తున్నారు. దీంతో దున్నే సమయంలో నాగళ్లకు అడ్డుగా వస్తున్నాయని రైతులు వరికొయ్యలతో పాటు గడ్డిని కాలబెడుతున్నారు.
దీనివల్ల అధిక నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ వరికొయ్యలను తగులబెట్టకూడదని వ్యవసాయ నిపుణులు, వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. రైతులు చాలామంది వరినాటు వేసే సమయంలో మొదటి దఫా దున్నుడుకు, రెండో దఫా దున్నుడుకు మధ్య నాలుగు నుంచి ఐదురోజుల సమయం మాత్రమే తీసుకుంటారు. దీనివల్ల కొయ్యకాలు, గడ్డి త్వరగా కుళ్లిపోవు. ఇలాంటి సమయంలో పశువులను అందులో వదిలితే అటూ తిరుగడం, పొలంలో పేడ, మూత్ర విసర్జన చేయడం ద్వారా త్వరగా కుళ్లి భూసారం పెరుగుతుంది.
పంట దిగుబడి 5 శాతం పెరుగుతుంది. లేదంటే అందులోనే కలియదున్ని కనీసం ఎనిమిది రోజుల సమయం తీసుకుని రెండు దఫా దున్నాలి. వీలైతే మొదటి దఫాలో ఒక్కసారి రోటోవేటర్‌తో దున్నితే గడ్డి, కొయ్యకాలు చిన్నచిన్న ముక్కలుగా విడిపోయి తరువాత దున్నినప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. దున్నే ముందు ఎకరానికి క్వింటాల్ సింగిల్ సూపర్ పాస్పేట్ చల్లితే కొయ్యలు, గడ్డి త్వరగా కుళ్లిపోతాయి. జీలుగ, పచ్చిరొట్ట విత్తనాలు వేసి ఏపుగా పెరిగిన తర్వాత కలియదున్నితే భూమి సారవంతంగా మారుతుందని వ్యవసాయాధికారులు పేర్కొన్నారు.
రైతులు వరికొయ్యలు కాల్చటం ద్వారా భూసారం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముంది. మంటల ద్వారా విపరీతమైన వేడితో భూసారాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా నత్రజని, పాస్పరస్ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గి దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు కాలిపోతాయి. పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయి.
పొలాల్లో తిరిగే పాములు, ముంగీసలు, ఉడుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక జీవరాసులు చనిపోయే ప్రమాదం అధికంగా ఉంది. ప్రస్తుతం వర్షాకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నందున ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. గట్లు, మొరం గడ్డలపై ఉన్న పచ్చని చెట్లు అగ్నికి బుగ్గవుతుంటంతో పర్యావరణానికి తీరని హాని కలుగుతుంది. ఆలస్యంగా కోతకు వచ్చే పంటలు, కల్లాల దగ్గరే ఉన్న ధాన్యం కాలిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
వరికొయ్యలు నేలలో కలియదున్నడం వల్ల సేంద్రియ కర్బనశాతం పెరిగి దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశముంది. దుక్కి దున్నే సమయంలో సింగిల్ సూపర్ పాస్పేట్ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. కలియ దున్నితే ఎకరాకు దాదాపుగా టన్ను ఎరువు తయారవుతుంది.
ప్రస్తుతం రైతులు వర్షాకాలం పంట సాగులో భాగంగా వేసిన వరిపంట చేతికొచ్చినందున వరిపంటలు కోసే పనులు ప్రారంభించారు. కోతల అనంతరం పొలాలను సిద్ధం చేసుకునే రైతులు తమ వ్యవసాయ పొలాల్లోని వరికొయ్యలను తగులబెట్టకుండా భూమిని కలియదున్నాలి. దీని ద్వారా సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. వరికొయ్యకాలకు నిప్పు పెట్టడం వల్ల గాలి, నేల కలుషితమవుతుంది. రసాయన ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించవచ్చు.
– వరప్రసాద్‌రెడ్డి, వ్యవసాయశాఖ మండల అధికారి