పరిగి/షాబాద్, డిసెంబర్ 19 : ఒకప్పుడు నీళ్లు, కరెంట్ సరిగా లేక ఏరువాక సాగలె.. రాష్ట్రమొచ్చాక అన్నీ పుష్కలమే.. ఎవుసం పండుగలా సాగుతున్నది.. బతుకుబండి గాడిల పడిందనుకునే సరికి మోసకారి కేంద్రం వడ్లు కొనబోమని కొర్రీలు పెట్టవట్టే.. ఇంతగనం రైతన్నలు ఆగమైతుంటే బీజేపోళ్ల కండ్లకు కనపడ్తలేదు.. కేంద్ర సర్కారోళ్ల చెవులు మార్మోగేలా నేడు చావుడప్పు కార్యక్రమంతో నిరసన తెలిపేందుకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ధాన్యం కొనేవరకు కొట్లాడుడేనని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులకు నిరసన కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛందంగా పాల్గొననున్న అన్నదాతలతో కలిసి పల్లెపల్లెనా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నారు. పలుచోట్ల జరుగనున్న ర్యాలీలు, నిరసన కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
తెలంగాణతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి, తెలంగాణలో యాసంగి వడ్లు కొనుగోలు చేయబోమని కేంద్ర మంత్రి చెప్పినందుకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు సోమవారం ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రతి గ్రామంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీలు నిర్వహించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నారు. అలాగే ప్రతి గ్రామంలో చావుడప్పు కొట్టనున్నారు. ఈ నిరసన కార్యక్రమాలకు సంబంధించి ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో సన్నాహకంగా పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యేలు దిశా నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా సీఎం కేసీఆర్ మార్గదర్శనం మేరకు టీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది.
ఊరూరా నిరసన
యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని ఇప్పటికే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నియోజకవర్గ కేంద్రాలలో ధర్నా చేపట్టారు. అయినప్పటికీ కేంద్రం వైఖరిలో మార్పు లేకపోవడంతో నరేంద్రమోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఊరూరా ర్యాలీలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం జిల్లా వ్యాప్తంగా స్థానిక రైతులతో కలిసి టీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీలో పాల్గొంటారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతులను దగా చేస్తున్న తీరును నిరసిస్తూ చావు డప్పును కూడా మోగించనున్నారు. యాసంగిలో కేంద్రం ధాన్యం తీసుకోనని తెగేసి చెప్పడంతో వస్తున్న ఇబ్బందులను కూడా రైతులకు ఈ సందర్భంగా వివరించాలని భావిస్తున్నారు. కేంద్రం వద్దనడంతోనే ఈ యాసంగిలో వరిసాగుకు బదులు ఇతర పంటలు సాగు చేయాలని కోరుతున్నట్లు రైతులకు అర్థమయ్యేలా నాయకులు వివరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అన్ని పంటలకు కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్‌తో ప్రతి గ్రామంలోనూ సంతకాల సేకరణ చేపడుతారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ, బీజేపీ దిష్టిబొమ్మలను కూడా దహనం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం కొనసాగేలా టీఆర్ఎస్ పార్టీ ఆదేశాలు ఇచ్చింది.
నిరసన గళం కేంద్రానికి వినిపించేలా..
ఆయా నియోజకవర్గాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో జరిగే కార్యక్రమాల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ, సింగిల్‌విండో చైర్మన్లు పాల్గొంటారు. ఊరూరా కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. నిరసన గళం కేంద్రానికి వినిపించేలా రైతులు ఆందోళన చేపట్టేందుకు సన్నద్ధమయ్యారు.
ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలి
ఆమనగల్లు, డిసెంబర్ 19 : తెలంగాణ రైతాంగంపై కేంద్రం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా నేడు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆదివారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ వేర్వేరు ప్రకటనల్లో కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం కోనుగోలు విషయంలో కేంద్రం అస్పష్టమైన ప్రకటనలు చేసి రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగిలో వరి సాగు, వానకాలం పంట ధాన్యం కోనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కేంద్రానికి రాష్ట్ర రైతుల ఇబ్బందులను తెలియజేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు నిరసనల్లో భాగస్వామ్యమై జయప్రదం చేయాలని కోరారు. గ్రామ, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో చావుడప్పు కొట్టి ఎన్డీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు.