గృహమే కదా స్వర్గసీమ అన్నాడో సినీ కవి.. అందమైన ఇల్లు కట్టుకోవాలన్నదే కోరిక. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. అందమైన పొదరిల్లు నిర్మాణానికి అయ్యే ఖర్చు కంటే డిజైన్‌కే ఎక్కువవుతున్నది. కొత్త కొత్త డిజైన్లతో ఇంటీరియల్ డెకరేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. బయటి ఎలివేషన్ మొదలు.. ఇంటీరియల్ ఎంపికలోనూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. పాల్ సీలింగ్, కప్ బోర్డులు, ఎలివేషన్, బెట్లు, బాల్కనీలు, స్టీల్ రెయిలింగ్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఇంటి లోపలి గోడలకు లప్పం వేయించడంతో పాటు డబ్ల్యూపీవీసీ తలుపులు, యూపీవీసీ కిటికీలను అమర్చుతున్నారు. కప్ బోర్డులతో వంట గదులు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి.
ఇబ్రహీంపట్నం రూరల్, ఫిబ్రవరి 3 : ఇప్పుడు కాలం మారింది. రెండు గదుల ఇండ్లు ఉంటే చాలనుకునే కాలం నుంచి సకల వసతులు ఉండేలా నిర్మించుకునే స్థాయికి గ్రామీణ ప్రాంతాలూ చేరుకున్నాయి. ఇల్లు ఒకేసారి కట్టుకుంటాం కదా.. మంచిగా ఉండాలి అనే రీతిలో ఆలోచిస్తున్నారు. ఇండ్ల నిర్మాణాలతో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, రాజస్తాన్ నుంచి వచ్చిన కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
ఇంటి కప్పునకు ఎక్కువమంది ఫాల్‌సీలింగ్ ఏర్పాటు చేయించుకుంటున్నారు. రకరకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. జిప్పం ప్లేట్లు కాకుండా యూపీవీసీ ప్లేట్లనూ ఫాల్సీలింగ్కు వాడుతున్నారు. ఫాల్‌సీలింగ్ వల్ల వేసవిలో చల్లగా ఉంటుందని, పైకప్పు విద్యుత్తు బల్బులతో అందంగా ఉంటుందని గృహ యజమానులు భావిస్తున్నారు. గతంలో తాండూరు బండలు ఫ్లోరింగ్ వేస్తే చాలా గొప్పగా ఉండేది. ఇప్పుడు వాటిని పార్కింగ్ కోసం వాడుతున్నారు.
ఇంటి లోపల మాత్రం మార్బుల్స్, గ్రానైట్స్, టైల్స్ వేస్తున్నారు. ఫ్లోరింగ్‌కు పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చిస్తున్నారు. పిట్ట గోడ, మెట్లు, బాల్కనీలకు రెయిలింగ్‌కు ఎక్కువగా వాడుతున్నారు. వీటిలో చాలా డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. స్థాయిని బట్టి కప్ బోర్డులను ఏర్పాటు చేసుకుంటున్నారు. బట్టలు, ఇతర వస్తువులు భద్రపరుచుకునేందుకు చాలామంది వీటిని ప్రిపర్ చేస్తున్నారు. ఇంటి నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ అంతా లభిస్తుండడంతో గృహ యజమానులకు ఇబ్బంది లేకుండా పోయింది.
గతంలో ఇల్లు నిర్మించుకోవాలంటే కలప ఎక్కువగా అవసరం ఉండేది. చౌకోట్లు, తలుపులు, కిటికీలు ఇలా అన్నింటికీ వినియోగించుకునేవారు. వేప, తుమ్మతో పాటు ఆర్థికంగా ఉన్నవారైతే టేకు కలపను వాడేవారు. కానీ, ప్రస్తుతం ట్రెండ్ మారింది. కలపకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. మెయిన్‌డోర్ మాత్రం టేకు లేదా నాణ్యమైన వేప కలపను వాడుతూ.. మిగతా వాటికి డబ్ల్యూపీవీసీ తలుపులు, యూపీవీసీ కిటికీలను ఉపయోగిస్తున్నారు. ఇందుకు సంబంధించి చాలా కంపెనీలు ఉండగా, ఆర్డర్ చేస్తే కంపెనీ సిబ్బంది ఇంటికి వచ్చి అమరుస్తున్నారు.
సకల సౌకర్యాలతో ఇల్లు ఉండాలని కోరురకుంటున్నారు. డబ్బులు ఎక్కువైనా వెనుకడుగు వేయడం లేదు. కలప వినియోగం తగ్గడంతో ఆర్థిక భారం లేకుండా పోయింది. కలపకు బదులు డబ్ల్యూపీవీసీ, యూపీవీసీ వంటివి విరివిగా అందుబాటులోకి వచ్చాయి. గృహ యజమానులు ఇంటీరియల్పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇంటి నిర్మాణం కంటే ఇంటీరియల్కే ఎక్కువ ఖర్చు అవుతున్నది.
– మైలారం విజయ్‌కుమార్, ఇంటీరియల్ డిజైనర్, ఇబ్రహీంపట్నం