శేరిలింగంపల్లి, అక్టోబర్ 3 : గోపన్‌పల్లిలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీటీఎన్జీవోల ఆందోళన శుక్రవారం నాటికి 80వ రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది ఉద్యోగులు నిత్యం ఈ ఆందోళనలో పాల్గొంటూ నిరసన వ్యక్తం చేస్తన్నారు. బీటీఎన్జీవోస్లకు కేటాయించిన స్థలాల ఆక్రమణను వ్యతిరేకిస్తూ గోపన్‌పల్లిలోని బీటీఎన్జీవోస్ కార్యాలయం ఆవరణలో నిత్యం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా వినూత్న తరహాలో ఉద్యోగులు ఈ నిరసన దీక్షల్లో పాల్గొని ఉద్యోగుల ఐక్యతను చాటుతూ తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 80 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు, పెన్షనర్లు అధిక సంఖ్యలో హాజరై ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తూ వస్తున్నారు. శుక్రవారం భాగ్యనగర్ టీన్జీవో ఉద్యోగులు ప్లకార్డులు చేతపట్టుకొని తమ భూములు తమకు ఇవ్వాలంటూ ఆందోళన నిర్వహించి నిరసన దీక్షల్లో పాల్గొన్నారు.
గురువారం విజయదశమి పండుగను ఉద్యోగులు దీక్ష శిబిరంలో ఘనంగా నిర్వహించారు. దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో హాజరైన ఉద్యోగులు గోపన్‌పల్లిలోని సొసైటీ కార్యాలయం ఆవరణలో ఉన్న జమ్మిచెట్టుకు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఐక్యమత్యంగా కుటుంభసభ్యుల తరహాలో పండుగ జరుపుకొన్నారు. మొదట శమీపూజ జమ్మచెట్టుకు నిర్వహించి దసరా శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. అంతకు ముందు రోజు బాగ్యనగర్ టీన్జీవో మహిళలు బతుకమ్మ సంబరాలు సైతం ప్రత్యేకంగా దీక్షశిబిరంలో జరుపుకోవడం విశేషం. మహిళలు బతుకమ్మ సంబరాలు జరుపుకొంటూ వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేసేవరకు పోరాటం ఆపేదిలేదని తేల్చిచెబుతున్నారు. భాగ్యనగర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, సెక్రటరీ మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, డైరెక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, రషీదాబేగం తదితరులు పాల్గొన్నారు.