షాద్‌నగర్, డిసెంబర్ 22 : సీఎం కేసీఆర్ సహకారంతో షాద్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి రికార్డు స్థాయిలో నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ తెలిపారు. గురువారం షాద్‌నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 242.34 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. పాత జాతీయ రహదారి విస్తరణలో భాగంగా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే రోడ్డు పనులకు రూ. 45 కోట్లు, ఆర్అండ్బీ పరిధిలోని రోడ్ల నిర్మాణాలకు రూ. 61.90 కోట్లు విడుదల కావడంతో పాటు మరో రూ. 20.85 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయాలు లేని గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాలను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసిందని, మొత్తం 37 గ్రామ పంచాయతీలకుగాను ఒక్కో కార్యాలయానికి రూ. 20 లక్షలను కేటాయించినట్లు పేర్కొన్నారు.
గిరిజన అభివృద్ధి శాఖ ద్వారా నియోజకవర్గంలోని పలు తండాలకు రూ. 8.12 కోట్లతో నూతనంగా బీటీ రోడ్లను నిర్మిస్తున్నామని అన్నారు. కొత్తూరు, షాద్‌నగర్ మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ. 20 కోట్లు, వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లను బాగుచేసేందుకు రూ. 43.39 కోట్లు, బీటీ రోడ్ల ప్రత్యేక మరమ్మతుల కోసం మరో రూ. 18.68 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇందులో భాగంగానే నూతన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తీగల ఏర్పాటు కోసం రూ. 12 కోట్ల నిధులకు ఆమోదం లభించిందని అన్నారు. కేశంపేట, ఆమన్‌గల్ బీటీ రోడ్డు, షాద్‌నగర్, జేపీ దర్గా బీటీ రోడ్డు, అయ్యవారిపల్లి బీటీ రోడ్డులను అభివృద్ధి చేస్తామన్నారు. షాద్‌నగర్ పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణకు ప్రజల సహకారం కచ్చితంగా ఉండాలని కోరారు.
జేపీ దర్గా మాస్టర్ ప్లాన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయనే విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు గ్రహించాలని, ఇప్పటికే సర్వే పనులతో పాటు కాలువ నిర్మాణాలు ఎలా చేపట్టాలో అధికారులు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ప్రతియేటా రూ. 58 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పన్నురూపేణా కేంద్రానికి చెల్లిస్తున్నా కేంద్రం కనీస నిధులను విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ బెంది శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు బక్కన్నయాదవ్, దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, కౌన్సిలర్లు చెట్ల పావని, శ్రీనివాస్, నాయకులు లక్ష్మణ్‌నాయక్, దేవేందర్‌యాదవ్, మురళీధర్‌రెడ్డి, నారాయణ, రవియాదవ్ పాల్గొన్నారు.