ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 11 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నది. భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నానికి చెందిన క్యామ మల్లేశ్‌ను పార్టీ అధిష్ఠానం డిక్లేర్ చేసిన విషయం విదితమే. దీంతో ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పార్టీ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఇబ్రహీంపట్నానికి రానున్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూరు గేటు వద్ద ఉన్న ప్రమిద గార్డెన్లో నియోజకవర్గానికి చెందిన ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రమిదగార్డెన్కు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, మరోవైపు కరువుతో పంటలు ఎండిపోవడంతో పాటు తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించనున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తుండడంతో నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను పెద్ద ఎత్తున తరలించేందుకు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి క్యాడర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్, యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి హాజరవుతున్నట్లు గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి తెలిపారు.
– జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా శుక్రవారం ప్రమిదగార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, నాలుగు మున్సిపాలిటీలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు హాజరు కావాలని కోరారు.