రంగారెడ్డి/వికారాబాద్, డిసెంబర్ 14 (నమస్తేతెలంగాణ): రంగారెడ్డిజిల్లాలో రెండోవిడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటింది. మెజార్టీ గ్రామాల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. జిల్లాలోని చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్, కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల్లో 178 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు ముందే 13గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. మొత్తం 165 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో బీఆర్ఎస్ 75 బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా, కాంగ్రెస్ 70 గ్రామాల్లో గెలుపొందింది. 9 గ్రామా ల్లో బీజేపీ, స్వతంత్రులుగా 10 మంది గెలుపొందగా, 13 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వికారాబాద్‌లో..
జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీల్లోనూ బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిచ్చింది. రెండో విడతలో 175 గ్రామ పంచాయతీలుండగా, 20 గ్రామ పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవం కావడంతో 155 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. రెండో విడతలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 37 గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 88 పంచాయతీల్లో, బీజేపీ-5 గ్రామ పంచాయతీల్లో, ఇతరులు-25 గ్రామ పంచాయతీల్లో గెలుపొందారు.
అయితే గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావాలంటే తమను గెలిపించాలంటూ ప్రచారం చేయడంతోపాటు అధికారులు పరోక్షంగా మద్దతిచ్చినప్పటికీ బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గట్టి పోటీనిచ్చారు. నాలుగైదు గ్రామ పంచాయతీల్లో అయితే చాలా స్వల్ప మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు ఓడిపోవడం గమనార్హం. అదేవిధంగా వికారాబాద్ మండలంలోని జైదుపల్లి గ్రామ పంచాయతీలో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో అధికారులు లక్కీ డ్రా ద్వారా అభ్యర్థిని ప్రకటించారు.
కాంగ్రెస్ అభ్యర్థిని విజయం వరించడంతో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి నిరుత్సాహానికి గురయ్యారు. అదేవిధంగా మర్పల్లి మండలం రాంపూర్ గ్రామ పంచాయతీలో అయితే బీఆర్ఎస్ అభ్యర్థి కేవలం ఒకే ఒక్క ఓటుతో ఓడిపోవడం గమనార్హం. రీకౌంటింగ్‌కు బీఆర్ఎస్ మద్దతుదారులు కోరినప్పటికీ రీ కౌంటింగ్ చేపట్టలేదని సమాచారం. మరోవైపు ధారూర్ మండలంలో మోమిన్కాలన్ గ్రామ పంచాయతీలో మొదట బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించగా, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి రీ కౌంటింగ్ చేయాలని కోరగా, రీ కౌంటింగ్‌లో 2 ఓట్ల తేడాతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపొందడం గమనార్హం.
ధారూర్ మండలంలోని రాజాపూర్ గ్రామ పంచాయతీలో 2 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. అదేవిధంగా ధారూర్ మండలంలోనే ఎబ్బనూరు గ్రామ పంచాయతీలో 5 ఓట్ల స్వల్ప మెజార్టీతో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి ఓడిపోయారు. మరోవైపు రెండో విడతలో 20 గ్రామ పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవంకాగా, వీటిలో 17 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు, ఒక్క గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్, రెండు గ్రామ పంచాయతీల్లో ఇతరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చేవెళ్ల నియోజకవర్గం-109
బీఆర్ఎస్ : 46
కాంగ్రెస్ : 50
బీజేపీ : 5
ఇతరులు : 3
ఏకగ్రీవం : 3
కడ్తాల్ మండలం -24
బీఆర్ఎస్ : 6
కాంగ్రెస్ : 10
బీజేపీ : 2
ఇతరులు : 2
ఏకగ్రీవం : 4
తలకొండపల్లి-32
బీఆర్ఎస్ : 19
కాంగ్రెస్ : 7
బీజేపీ : 1
ఇతరులు : 2
ఏకగ్రీవం : 3
ఆమనగల్లు-13
బీఆర్ఎస్ : 4
కాంగ్రెస్ : 3
బీజేపీ : 1
ఇతరులు : 4
ఏకగ్రీవం : 1